గిరిజన గ్రామాల్లో నిశ్శబ్ద యజ్ఞం


దేశవ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవం సాగు తోంది. కొండల్లో, లోయల్లో, సుదూర ప్రాంతాల్లో, గ్రామాల్లో, అడవుల్లో లక్షలాది మంది తృణమూల స్థాయిలో కార్యకర్తలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. పంజాబ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు, బీహార్‌ నుంచి కేరళ వరకు గత 67 సంవత్స రాలుగా ఈ నిశ్శబ్ద యజ్ఞం సాగుతోంది.

ఈ మహిళలు వనవాసి కల్యాణ్‌ ఆశ్రమ్‌ సభ్యులు. గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పారిశుధ్యం, నీటి వనరులు, అడవుల సంరక్షణ, పర్యావరణం, గిరిజన యువతీ యువకు లకు విద్యావకాశాలు సంఘర్షణ ఉన్న చోట శాంతి సాధన, క్రీడల్లో శిక్షణ. గిరిజన సంస్కృతిలో పునరు ద్ధరణ తీసుకురావడం, మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నవారికి కొత్త అవకాశాలు కల్పించటం -ఇవి వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ చేసే కార్యకలాపాలు.

''ముప్పై ఏళ్ల క్రితం నేను కల్యాణ్‌ ఆశ్రమ హాస్టల్లో ఉండి చదువుకున్నాను అప్పట్లో అపరిచితు లను చూస్తే మా గిరిజన జనాభా ఏ విధంగా భయపడి పారిపోయేవారో నాకింకా స్పష్టంగా గుర్తుంది. మేము అప్పుడు నిరక్షరాస్యులం. మాకు తాగునీరు ఉండేది కాదు. అనేక విచిత్రమైన వ్యాధులు వచ్చేవి. ప్రభుత్వ పథకాల ఫలాలేవీ మాకు అందేవి కావు. అటువంటి సమయంలో కళ్యాణ్‌ ఆశ్రమ్‌ ఏర్పాటు ద్వారా మొత్తం పరిస్థితి మారిపోయింది'' అంటారు కిముడు అచ్చమ్మ. ఆమె విశాఖపట్నం జిల్లా పాడేరు కేంద్రంలో ఇంచార్జిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా హాస్టళ్లు నడిపించే వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌, పిల్లలకు ఆశ్రయం ఇచ్చి పాఠశాల విద్య, ఆరోగ్యం, క్రీడల్లో శిక్షణ అందిస్తుంది. కళ్యాణ్‌ ఆశ్రమంలో చదువుకున్న అనేక మంది పిల్లలు పెద్దవాళ్లై వివిధ రంగాల్లో విజయం సాధిస్తున్నారు. క్రీడల్లో లింబారామ్‌ కవితా రౌత్‌ వంటివారు హాస్టల్‌ నుంచి చదువుకున్న విద్యార్థుల్లో ప్రముఖులు.

మహిళలకు, యువతకు జీవనోపాధి శిక్షణ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక బృందాలు నడపడంతో పాటు, వికెఎస్‌ వనరుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. రైతులకు, మత్స్యకారులకు ఇతరులకు అనేకవిధాలుగా మద్దతు అందిస్తుంది.

''పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఏడాదిలో ఒక్క పంట పండించుకోవడం కూడా ఎంతో కష్టం అయితే అక్కడ మేము చెరువులన్నింటినీ పునరుద్ధ రించి ప్రతి రైతు కూడా తన పొలంలోనే ఒక చిన్న కుంట ఏర్పర్చుకునేలా సహాయపడ్డాము దీనితో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు కుంటలో చేపలను వారు పెంచుకోగలిగారు, రైతులు ఏడాదిలో రెండు పంటలు పండించు కోగలిగారు'' అంటారు పురూలియాకి చెందిన మాలతి సోరెన్‌. అక్కడ గిరిజన ప్రాంతాలు ఎంతో వెనుకబడి ఉండేవని ఆమె చెప్తారు.

''ఒక గ్రామంలో అయితే చదవడం రాయడం వచ్చిన అబ్బాయి ఒక్కడే ఉండేవాడు. ఆ అబ్బాయి పట్టణంలో చదువుకుంటుంటే ఊళ్లో వాళ్లు అబ్బాయి ఊరికి ఎప్పుడు వస్తాడా తమ ఉత్తరాలు ఎప్పుడు చదివి పెడతాడా అని నెలల తరబడి వేచి ఉండేవారు. ఆ ఉత్తరాల్లో శుభవార్తలు ఉండని దుర్వార్తలు ఉండని అనేక నెలలు గడిచే వరకు వేచి ఉండడం తప్ప వారికి గత్యంతరం ఉండేది కాదు'' అని గుర్తుచేసుకుంటారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వీణాపాణి దాస్‌.

గిరిజన ప్రాంతాల్లో తీవ్రవాదాన్ని, వర్గాల మధ్య ఘర్షణను తగ్గించడంలో కూడా ఈ బృందాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ''అసోంలో బస్తర్లో మణిపూర్లో అరుణాచల్లో రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణలు జరిగినప్పుడల్లా ఇరుపక్షాలు కూడా ఎంతో నష్టపోయేది. అటువంటి చోట్ల మేము జోక్యం చేసుకుని వారికి నచ్చచెప్పి శాంతి నెలకొనేలా చేస్తాము,'' అని వివరిస్తారు వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ మహిళా బృందాల జాతీయ అధ్యక్షురాలు మాధవి జోషి.

వామపక్ష తీవ్రవాదం పెచ్చరిల్లిన బస్తర్‌ ప్రాంతంలోనూ, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ మహిళా సభ్యులు ఎంతో ధైర్యంతో తీవ్రవాదులను ఎదుర్కొని అక్కడి గిరిజన తెగలు అభివృద్ధి పథంలో ముందుకు పయనించేలా చేయగలిగారు. రాత్రిపూట పాఠశాలలు నిర్వహిం చడం, ఉచితంగా కోచింగ్‌ తరగతులు, రీడింగ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు ఉండే ఏకల్‌ పాఠశాలలను కూడా నిర్వహిస్తుం టాయి. గిరిజన తెగలకు చెందిన యువతులు చిన్న పిల్లలకు, స్కూలు మానేసిన పిల్లలకు పాఠాలు చెప్తుంటారు. ఎన్నో సార్లు ఈ యువ టీచర్లు తమకు కేటాయించిన స్కూలు చేరుకునేందుకు అనేక కిలోమీటర్లు నడిచి కూడా పెడుతుంటారు.

కొండలు కానీ, లోయలు కానీ, దట్టమైన అడవులు కాని, చివరికి హిమాలయ పర్వతాలు కానీ, వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ బాలికలకు యువతు లకు ఎటువంటి ప్రాంతమైన కూడా దుర్భేద్యం కాదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో టిబెట్‌ చైనా సరిహద్దుల వద్ద ఉండే గిరిజన గ్రామాలను చేరుకు నేందుకు కొండలు ఎక్కి వెళ్లే కార్యకర్తలను అడగండి కావాలంటే ఎంత ఎత్తైనా సరే తన లక్ష్యం కోసం సులువుగా పడిపోతాయని నవ్వుతూ చెబుతారు.

యువతులు బాలికల అక్రమ రవాణాను నివారించడం కూడా వనవాసీ కళ్యాణ్‌ సభ్యులు చేసే ముఖ్యమైన పనుల్లో ఒకటి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్లో చిన్నపిల్లలు సరిహద్దు ఆవలికి పంపి వారు మళ్లీ కనిపించకుండా చేస్తారని గుర్తించిన మహిళా స్వయం సహాయక బృందాలు, బాలికలను స్కూళ్లకు తీసుకొచ్చి, బాల్య వివాహాలను నివారించేలా చర్యలు తీసుకుంటుంటారు. అయితే, వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ పని కేవలం గిరిజన గ్రామాల్లోనే కాదు, కోల్కతా వంటి మహానగరంలో కూడా అనేక ఫలితాలు సాధిస్తోంది. కోల్కతలో ఉష అగర్వాల్‌ వన యాత్రలు నిర్వహించడం ద్వారా, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించడం ద్వారా పట్టణ ప్రాంతాలకూ గిరిజన ప్రాంతాలకూ మధ్య వంతెనలు నిర్మిస్తున్నారు

వనవాసీ కల్యాణ బృందాల్లో పనిచేసే వారు చాలావరకూ స్వచ్ఛంద కార్యకర్తలే. కొంతమంది మాత్రమే పూర్తిస్థాయిలో ఆ పనిలో నిమగ్నమవు తారు. పాఠశాలల్లో హాస్టల్‌ లో ఉండి చదువుకున్న బాలికలు మళ్లీ వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమ్‌ పని చేయడానికి ఇష్టపడటం ఆనేది పరిపాటిగా జరుగు తుంటుంది. ''మేము చదువుకుని మా జీవితంలో ఎంతో మార్పును చూశాము. మా వంటి పిల్లలకు ఆ అవకాశం ఇచ్చేందుకు పని చేయడమనేది మాకు గర్వంగా అనిపిస్తుంది,'' అంటారు రోష్ని దేశ్ముఖ్‌.

గిరిజన భారతంలో విద్య, ఆరోగ్యం, వైద్య అవకాశాలు, జీవనోపాధి అవకాశాలు తెచ్చేందుకు నిస్వార్థంగా కేవలం సేవా స్ఫూర్తితో పనిచేసే ఈ వేలాది మంది కార్యకర్తలు ఆధునిక భారత దేశంలో ప్రతి పౌరుడు చెయ్యెత్తి జై కొట్టవలసిన నిశ్శబ్ధ యుద్ధ వీరులు.          

-ఉషా తురగ రేవెల్లి