భారత ప్రతిభకు ఆకాశమే హద్దు


భారతీయులంతా మరోసారి గర్వంగా తలెత్తుకు నేట్లు చేసే అద్భుత ప్రయోగమే చంద్రయాన్‌-2. శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి 2008 అక్టోబర్‌ 22న ప్రయోగించిన  చంద్రయాన్‌-1 కంటే ఇది చాలా మెరుగైనది.

చంద్రయాన్‌-1

చంద్రయాన్‌ అంటే సంస్కృతంలో 'చంద్రుని వద్దకు ప్రయాణించే వాహనం' అని అర్ధం. ఇది ఒక అంతరిక్ష నౌక. అందువల్ల ఈ మొత్తం కార్యక్రమానికి చంద్రయాన్‌ అని పేరు పెట్టారు. చంద్రయాన్‌-1 ఇప్పటికే చంద్రుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరించింది. అక్కడ నీటి జాడలను కనిపెట్టింది. వాతావరణం, నేల, ఖనిజసంపద మొదలైనవాటి గురించి సమాచారం సేకరించడానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు కలిగిన చంద్రయాన్‌-1 3400 సార్లు చంద్రుని చుట్టూ తిరిగి విలువైన సమాచారాన్ని భూ కేంద్రానికి పంపింది.

చంద్రయాన్‌-2

జులై 22న శ్రీహరి కోట నుంచి ఇస్రో విజయ వంతంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 కార్యక్రమంలో మొత్తం మూడు దశలు ఉంటాయి. మొదటిది చంద్రుని చుట్టూ తిరిగే చంద్రయాన్‌ అంతరిక్ష నౌక ప్రయోగం. రెండవది, విక్రమ్‌ అనే ల్యాండర్‌ చంద్రునిపై దిగడం. మూడు, ప్రగ్యాన్‌ అనే రోవర్‌ చంద్రునిపై తిరగడం. ల్యాండర్‌, రోవర్‌లను తీసుకువెళ్లే 3.8 టన్నుల బరువు కలిగిన చంద్రయాన్‌-2 అంతరిక్ష నౌకను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు పూర్తిగా స్వదేశంలో తయారుచేసిన క్రయోజెనిక్‌ రాకెట్‌ను ఉపయోగిం చారు. ప్రయోగం తరువాత 17 నిముషాలకు క్రయోజెనిక్‌ ఇంజన్‌ ఆర్బిటర్‌ ను భూ కక్ష్యలో ప్రవేశ పెట్టింది.  ఆర్బిటర్‌ జీవితకాలం ఒక సంవత్సరం. ఈ ఆర్బిటర్‌ చంద్రునిపైకి ల్యాండర్‌ను దింపుతుంది. ఈ ల్యాండర్‌లో ఉండే రోవర్‌ చంద్రునిపై తిరిగి పరిశోధనలు చేస్తుంది.

చంద్రుని దక్షిణ ధృవంపై రోవర్‌ను దింపే మొట్టమొదటి కార్యక్రమం చంద్రయాన్‌-2. ఇంతవరకు ఏ దేశం ఈ ప్రాంతంలో పరిశోధనలు జరపలేదు. నీటి మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే చంద్రుడు, సౌర వ్యవస్థ క్రమ పరిణామానికి సంబంధించిన సమాచారం లభిస్తుంది. భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-2 పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.