టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు రద్దు


నిరంకుశుడైన టిప్పు సుల్తాన్‌ను కీర్తిస్తూ, ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రారంభించిన 'టిప్పు జయంతి' వేడుకలను ప్రస్తుత యడ్యూరప్ప ప్రభుత్వం రద్దుచేసింది. వివిధ ప్రాంతాల నుండి వెలువడిన బలమైన నిరసనలను పరిగణనలోకి తీసుకుని టిప్పు జయంతి వేడుకలను రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఈ వేడుకల వల్ల జరుగుతున్న నిరసనలు, మరణాలు, ఆస్తి నష్టాన్ని ఉదహరిస్తూ, ఈ వేడుకలు కొడగు జిల్లా ప్రజల మధ్య చీలికను సృష్టిస్తున్నాయని, కొడగు జిల్లా, విరాజ్‌పేటకు చెందిన స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చరిత్రకారులు, విద్యావేత్తలు, నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. టిప్పు జయంతిని తీవ్రంగా వ్యతిరేకించే వారిలో ఒకరైన సీనియర్‌ చరిత్రకారుడు చిదానందమూర్తి, ఈ వేడుకల రద్దు చర్యను స్వాగతించారు.

టిప్పు జయంతి - విభజన రాజకీయాలలో ఒక భాగం

రాష్ట్ర రాజకీయాలను విభజించే ఎత్తుగడలో భాగంగా, సిద్దరామయ్య ప్రభుత్వం 2014 నుండి రాష్ట్ర ఖజానా డబ్బుతో 'టిప్పు జయంతి' ని జరపడం ప్రారంభించారు. అనేక మంది ముస్లిం నాయకులు, విద్యావేత్తలతో సహా అన్ని ప్రాంతాల నుండి బలంగా నిరసనలు తెలియచేస్తున్నప్పటికీ, మొండిగా, పట్టుదలగా సిద్దరామయ్య ఈ వేడుకలను జరిపారు. 2014లో టిప్పు జయంతి సందర్భంగా జరిగిన ర్యాలీలలో పలువురు హిందూ నాయకులను మతోన్మాద ఇస్లాంవాదులు హత్య చేశారు. మృతి చెందిన వారిలో మాడికేరికి చెందిన సీనియర్‌ వీహెచ్‌పీ నాయకుడు కుటప్ప కూడా ఉన్నారు. అయితే సిద్ద రామయ్య ప్రభుత్వం ఆ హత్యను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది.

 ఈ వేడుకలు,వాటిని నిర్వహించే బిల్లును కన్నడ భాషా, సాంస్కృతిక శాఖకు బదలాయించడం ఒక వెటకారంలాంటిది. టిప్పు తన పాలనలో కన్నడ భాషను తొలగించడానికి అన్నిరకాల పద్ధతులను ప్రయత్నించడమే కాక పర్షిన్‌ ను రాజభాషగా చేస్తూ  ఆదేశాలు జారీ చేశాడు.