'విత్తన హక్కు' డిమాండ్‌ చేసిన కిసాన్‌ సంఘ్‌


హెచ్‌టిబిటి విత్తనాలు తయారు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రభుత్వాన్ని కోరింది. విత్తనాలకు సంబంధించి ఎలాంటి పరీక్ష చేయ కుండా, అనుమతులు పొందకుండా వాటిని ఉత్పత్తి చేస్తున్నారని, అలాంటి విత్తనాల వాడకంలో అవగాహన, శిక్షణ లేని రైతులు వాటివల్ల తీవ్రంగా నష్టపోతున్నారని కిసాన్‌ సంఘ్‌ ఆరోపించింది. నాణ్యమైన, సరైన విత్తనాలు పొందే 'హక్కు'  రైతుకు కల్పించాలని డిమాండ్‌ చేసింది.

పాట్నాలో జరిగిన జాతీయ కార్యవర్గ సమా వేశాల్లో దీనికి సంబంధించి తీర్మానం ఆమోదిం చారు. కాన్సర్‌ కారక రసాయనాలు అత్యధికంగా ఉన్న గ్లైఫోసేట్‌ అమాకాలను వెంటనే నిషేధించాలని కూడా కిసాన్‌ సంఘ్‌ కోరింది. 'హానికారక మందును విక్రయించేవారికి జీవిత ఖైదు విధించాలని' ఒక తీర్మానంలో డిమాండ్‌ చేసింది. జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ కు సంబంధించిన కమిటీని వెంటనే రద్దు చేయాలని, జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ కార్య కలాపాలు సాగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. భారతీయ వ్యవసాయ రంగంలో అనవసరమైన పోటీని సృష్టిస్తున్న విదేశీ కంపెనీలను దేశం నుంచి సాగనంపాలని కోరింది.

మహారాష్ట్రలో వాడకంలో ఉన్న హెచ్‌టిబిటి పట్టి విత్త్నాలు, హరియాణలో రైతులు ఉపయో గిస్తున్న బి టి వంకాయ విత్తనాల గురించి సర్వత్ర చర్చ జరుగుతోందని, ఆందోళన వ్యక్తమవుతోందని కిసాన్‌ సంఘ్‌ నాయకుడు మోహినీ మోహన్‌ అన్నారు. విత్తన కంపెనీలు మాత్రం హానికారకమైన విత్తనాలను తయారుచేసి, గుట్టుచప్పుడు కాకుండా రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. మొక్కలు అవసరానికి మించి ఎడగకుండా నివారించే రసాయనాలు ఈ హెచ్‌టిబిటి పత్తి విత్తనాలపై పనిచేయవు. ఇలాంటి విత్తనాలను ఉపయోగించాలంటే గ్లైఫోసెట్‌ వాడకం తప్పనిసరి. ఈ రకం విత్తనాల వాడకాన్ని ప్రభుత్వం అనుమతించలేదు. అలాగే వీటిని పూర్తి స్థాయిలో పరీక్షించలేదు. కాబట్టి వీటి వాడకం చట్ట వ్యతిరేకం, నేరం. ఈ హెచ్‌టిబిటి పరిజ్ఞానం ప్రమాదకరమైనది, సరిచేయలేనిది. బిటి పత్తి విత్తనాలకు గులాబీ రంగు పురుగు పడుతోంది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. కలుపును నాశన చేయడానికి ఉపయోగిస్తున్న రసాయనాలకు ఆ మొక్కలు క్రమంగా అలవాటుపడటం వల్ల అవి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. కానీ కాన్సర్‌ కారకమైన ఈ రసాయనాలవల్ల మనుషులకు, జంతువులకు మాత్రం హానిజరుగుతోంది. పైగా ఎలాంటి రసాయనాలకు లొంగని శక్తిని కలుపు మొక్కలు సంతరించుకుంటున్నాయి'అని కిసాన్‌ సంఘ్‌ ఒక తీర్మానంలో పేర్కొంది.

ప్రభుత్వ అనుమతులు పొందడంలో విఫలమైన విదేశీ కంపెనీలు దొడ్డిదారిన ఈ కాన్సర్‌ కారక పరిజ్ఞానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. మార్కెట్‌ను ముంచెత్తడం ద్వారా రైతులు ఈ విత్తనాలను తప్పనిసరిగా కొనవలసిన పరిస్థితి కల్పిస్తున్నాయి. మన దేశంలోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యంపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రైతులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయనాయకులు, మేధావులు, పత్రికా రచయితలు మొదలైనవారి మధ్య గొడవలు సృష్టించి, తమ పబ్బం గడుపుకోవాలని చూస్తు న్నాయి. ఈ కంపెనీల కుట్రను జీవ సాంకేతిక పరిజ్ఞాన కార్యకలాపాలను పర్యవేక్షించవలసిన జిఈఏసి వంటి ఏజెన్సీలు ఎందుకు నిర్వీర్యం చేయలేకపోతు న్నాయని కిసాన్‌ సంఘ్‌ తీర్మానంలో ప్రశ్నించింది.

ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం రైతుకు 'విత్తన హక్కు' కల్పించాలని సూచించింది. విత్తన హక్కు అంటే స్వదేశీ విత్తన తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలు, కొనుగోలుకు అవకాశం కల్పించడం.