శ్రీ హయగ్రీవ జయంతి


జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిమ్‌|

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే||


హయగ్రీవుడు సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మధు, కైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించినపుడు, శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో ఆ రాక్షసులను వధించి వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికి, వివేకానికి మూలం. ఆ వేదాలను రక్షించిన హయగ్రీవుడు జ్ఞానప్రదాత. హయగ్రీవుడు అంటే అశ్వపు(గుఱ్ఱం) శిరస్సు ఉన్నవాడు.

పూర్వము గుఱ్ఱపు శిరస్సు ఉన్న ఒక రాక్షసుడు లోకాలను హింసించాడు. తనలాగే గుర్రపు శిరస్సు ఉన్నవారి చేతిలోనే మరణం ఉండాలనే వరం పొంది ఉన్నాడు. ఆ రాక్షసుడిని సంహరించటానికి విష్ణువు హయగ్రీవరూపం ధరించాడని చెబుతారు. ఆయన విష్ణుమూర్తి అవతారమే అయినా, ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్య చంద్రులు నేత్రాలుగా, దేవతలు ఎముకలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా ఆయన శరీరంలోని అణువణువూ దేవతామయం.

హయగ్రీవుడు జ్ఞానప్రదాత కాబట్టి హయగ్రీవ జయంతి రోజున అక్షరాభ్యాసం చేస్తారు. ఈ రోజు ఆయనను ఆరాధించిన వారికి సకల విద్యలూ అబ్బుతాయని ప్రతీతి.

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమినాడు, రక్షాబందన్‌తో పాటు హయగ్రీవ జయంతి ఉండటం చాలా విశేషం.

(ఆగస్టు 18, శ్రావణ పూర్ణిమ హయగ్రీవ జయంతి సందర్భంగా)