దేశవిభజనకు దారితీసిన విదేశీ కుట్ర


ప్రపంచంలో అతి ప్రాచీనమైనది, పుణ్యభూమి అయిన హిందూ దేశం 1947 ఆగస్టు 15 న కుట్ర పూరితంగా 'రెండు దేశాలు'గా విభజించ బడింది.

ఎంతో విషాదకరమైన ఈ చారిత్రక సంఘటన వెనుక పెద్ద చరిత్రే ఉన్నది. అయితే ఈనాటి తరానికి దేశ విభజన గురించి అవగాహన అంతగా లేకపోవడం దురదృష్టకరం.

ఆంగ్లేయుల పాత్ర

నేడు శ్రీలంకగా వ్యవహరిస్తున్న ''లంక'' చోళలు-పాండ్యుల కాలం నుండి మనదేశంలో అంతర్భాగం. కాని ఆంగ్లేయులు కావాలని 'లంక' ని వేరుచేసి మన దేశంలో భాగం కాకుండా జాగ్రత్త పడ్డారు. 1905 సంవత్సరంలో బెంగాలును విభజించారు. 1909లో ముస్లిములకు ప్రత్యేక నియోజకవర్గాలేర్పరిచి భవిష్యత్తు విభజనకు బీజం వేశారు. 1937 సంవత్సరంలో బ్రహ్మదేశాన్ని (బర్మా) భారతదేశం నుండి వేరు చేశారు. బ్రిటీషువారి రహస్య సమర్థనతో సయ్యద్‌ అహమ్మద్‌ఖాన్‌ ద్విజాతి సిద్ధాంతానికి తెర తీశాడు. ఆ తరువాత ఏ.కే.ఫజల్‌ ఉలాహ్‌హఖ్‌ మార్చ్‌ 23,1940న లా¬రు సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని తీర్మానం పెట్టి నెగ్గించుకున్నాడు.

వందేమాతర నినాదంతో ఒక్కటైన దేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉదృతంగా సాగుతోంది. కానీ1920 సంవత్సరంలో లోకమాన్య తిలక్‌ మరణంతో స్వాతంత్య్ర ఉద్యమం స్వార్థపరుల చేతిలోపడి ఆత్మహత్యాసదృశమైన ''ముస్లిం సంతుష్టీకరణ'' మొదలయినది. ఈ నేపధ్యంలో మహమ్మద్‌ అలీ జిన్నా పాకిస్తాన్‌ నినాదంతో రంగప్రవేశం చేశాడు. కాంగ్రెసు సంతుష్టీకరణ విధానాలు, బ్రిటీషువారి కుట్ర, ముస్లింల మతోన్మా దానికి పాశ్చాత్య కుట్రలు తోడై భారత విభజన తప్పలేదు. ఒక శక్తివంతమైన అఖండ హిందూదేశం ఏర్పాటు అంతర్జాతీయ శక్తులకు కూడా మ్రింగుడు పడని విషయం. అయితే పులిమీద పుట్రలాగ కాంగ్రెసు నాయకుల స్వార్థం కారణంగా పంజాబు లోని లా¬రు నగరం, తూర్పు బెంగాలులోని సిల్హెట్‌లను కోల్పోవలసి వచ్చింది. మొత్తం బెంగాలును పోగొట్టుకొనే స్థితిలో ఉన్నపుడు శ్యామాప్రసాదు ముఖర్జీ ''ఏకదీక్షగా'' చేసిన పోరాటం కారణంగా ఇప్పటి ''పశ్చిమ బెంగాలు'' దక్కింది.

అయితే, వెంటనే కాకపోయినా, భవిష్యత్తులో నైనా తిరిగి అఖండ భారత నిర్మాణం చేయాలి. ఇప్పుడు దేశంలో వీస్తున్న ''దేశభక్తి'' పవనాలు ఆ దిశలో సహాయకారి కాగలవు.

- ధర్మపాలుడు