హిందూ సంస్థల సంఘటిత శక్తి ఫలితం.. శ్రీశైలం అవినీతి ఈవో బదిలీ


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైనది అయినటువంటిది శ్రీశైల క్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎండోమెంట్‌ దేవాలయాల్లో ఇది ఒకటి. అయితే గత కొంత కాలంగా శ్రీశైల దేవస్థాన పరిపాలనా విభాగంలో అన్యమత ఉద్యోగుల నియామకం, దేవస్థానానికి చెందిన టెండర్లను, లైసెన్సులను ముస్లిములకు కట్టబెట్టడం వంటివి జరుగుతున్నాయి. దీనికి ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఎ. శ్రీరామచంద్ర మూర్తి మద్దతు ఉండటంతో హిందువుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. 
2011 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎండోమెంట్స్‌ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దేవస్థానానికి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో కానీ, మరే ఇతర కాంట్రాక్టులను కానీ హైందవేతరు లకు ఇవ్వరాదని నిబంధన విధించారు. ఈ నిబంధనను అతిక్రమిస్తూ గతంలో శ్రీశైలం దేవస్థానానికి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్‌ లైసెన్సులతో పాటు ఇతర లైసెన్సులను ముస్లిం మతానికి చెందిన వ్యక్తులకు కట్టబెట్టారు. ఇక అప్పటి నుండి ఆలయ పరిపాలనా విభాగంలో కూడా వారిదే పెత్తనం. ఇందులో రఫీ, రజాక్‌ అనే ఇద్దరు ముస్లిములు తమకున్న రాజకీయ పలుకుబడితో అక్కడి హిందూ ఉద్యోగులపైనా, భక్తులపైనా తమ పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి కూడా వీరికి మద్దతు పలుకుతుండటంతో వివాదం తీవ్రరూపం దాల్చింది.

ఆగస్టు 16, 2019 నాడు దేవస్థానం షాపింగ్‌ కాంప్లెక్సుల లైసెన్సులకు దాఖలు చేయాల్సిన టెండర్ల సమర్పణకు ముస్లిములు కూడా రావడంతో స్థానిక హిందువులు ఆగ్ర¬దగ్రులయ్యారు. శ్రీశైల క్షేత్రాన్ని ముస్లిముల అనధికార పాలన నుండి విముక్తం చేయాలని హిందూ సంస్థలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. శ్రీశైల క్షేత్రంలో జరిగే అవినీతి అక్రమాలు, అన్యమతస్తుల ఆధిపత్యంపై శాంతియుత నిరసన నిర్వహించాలని ప్రణాళిక రూపొందించాయి.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విశ్వ హిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌, మొదలైన హిందూ సంస్థల కార్యకర్తలందరూ శ్రీశైలం చేరుకొని అక్కడ నిరసన చేపట్టాలని పిలుపు నివ్వడంతో తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది హిందువులు అక్కడకు వచ్చారు.  ఈలోగా శ్రీశైల ఆలయ ఈవోను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు.

వివాదాలకు కేంద్ర బిందువు ఆలయ ఈవో

శ్రీశైల దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా పనిచేసిన ఎ. రామచంద్రమూర్తి వైఖరి మొదటి నుండీ వివాదాస్పదం, అవినీతిమయం. అంతే కాకుండా అతడు రెండు వివాహాలు చేసుకున్నట్టు, ఇందుకోసం ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించినట్టు అతడిపై 2010లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ సమయంలో శ్రీకాళహస్తి దేవస్థాన ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా పనిచేస్తున్న రామచంద్ర మూర్తిపై, అదే ఆలయయ పాలకమండలి సభ్యుడు ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డి కోర్టులో కేసు వేశారు. రామచంద్ర మూర్తి ఇస్లాం మతం స్వీకరించినట్టు, ఒక భార్య ఉండగానే మరొకరిని కూడా వివాహం చేసుకున్నట్టు తన పిటిషన్‌ లో సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు. దీనిపై అనేకసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును అశ్రయించినట్టు అయన తెలియజేసారు. ఈ వ్యవహారంలో ఎన్ని నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో హైకోర్టు రామచంద్ర మూర్తిపై అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ చేసింది.

ఆలయ వ్యవహారాల్లో అన్యమతస్థులు జోక్యం పూర్తిగా నిర్మూలించి, ఆలయ పవిత్రతను కాపాడాలని, అలాగే చుట్టుపక్కల తిష్ఠ వేసుకుని ఉన్న అన్యమతస్తులను, వేలంపాటలో షాపులు అక్రమంగా పొందిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థల ప్రతినిధులు నూతన ఈవోకు మెమోరాండం సమర్పించారు.

శ్రీశైలంలో 17 మంది అన్యమత ఉద్యోగులు

ఇదిలా ఉండగా ఇప్పటి దాకా శ్రీశైల దేవస్థానం పరిపాలనా విభాగంలో 17 మంది అన్యమతస్థులు నియామక వివరాలు లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ తమ ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా బయటపెట్టింది. వారిలో ముగ్గురు రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా మిగిలిన వారు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా స్పష్టమైంది. ఉద్యోగుల పేర్లతో సహా వారి ఎంప్లొయ్‌ ఐడీలు, నియామక తేదీలు, నియామక ఉత్తర్వుల వివరాలు కూడా లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ వెల్లడించింది.