నిద్ర - నియమాలు


ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నిద్ర సక్రమంగా ఉండాలి. నిద్ర వలన శ్రమ, అలసట పోతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరం నీరసంగా తయారవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు , వృద్దులకు నిద్ర అత్యంత ముఖ్యం. ప్రతిమనిషి 5 గంటల నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రపోవాలి. నిద్ర రెండురకాలు. అవి  1. గాఢనిద్ర. 2 . కలతనిద్ర.

 గాడనిద్ర : మైమరచి, బాహ్య విషయాలు తెలియకుండా రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రపోవడం. దీనివల్ల మానసికపరమైన ఉల్లాసం, విశ్రాంతి లభించి దైనందిక కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించగలుగుతాం.

కలతనిద్ర : నిద్రపోతున్నప్పుడు కొంతవరకు బాహ్యవిషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎవరైనా బిగ్గరగా మాట్లాడినా, శబ్దం చేసినా వెంటనే మెలుకువ వస్తుంది. ఈ నిద్ర వలన పూర్తి విశ్రాంతి కలుగదు. కొంతవరకు శారీరక విశ్రాంతి మాత్రం లభించును.

నిద్ర నియమాలు :

-  కొన్నాళ్లు జబ్బు పడి లేచినవారు, జ్వరంతో బాధపడేవారు, నిద్రవచ్చినప్పుడు కునికిపాట్లు పడవచ్చు కాని పూర్తిగా నిద్రపోగూడదు అని ఆయుర్వేదం స్పష్టంగా చెప్పింది.

-  జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం తీసుకుని నిద్రపోతే జ్వరం వెంటనే తిరగబెడుతుంది. కాబట్టి  వైద్యుడు చెప్పిన ప్రకారమే నిద్రపోవాలి.

- ఏదైనా పరిస్థితులలో రాత్రి జాగరణ చేస్తే రాత్రి ఎంతకాలం నిద్ర తగ్గినదో అంత సమయంలో సగభాగం ఉదయాన్నే ఆహారం తీసుకోకుండా నిద్రించాలి.

- సాయంత్రం సమయంలో టీ, కాఫీ తాగడం మానుకుంటే రాత్రి  చక్కటి నిద్రపడు తుంది.

- ఎక్కువుగా పొగ తాగేవారికి నిద్రపట్టదు. పొగలోని నికోటిన్‌ అనే విషపదార్థం ఎక్కువ ఉత్తేజం కలిగించి నిద్రను రానివ్వదు.

-  నిద్రపోవడానికి ముందు ఆలోచనలను దూరం పెట్టి ప్రశాంతంగా ఉండి వెల్లకిలా పడుకొని ధ్యానం చేయడం వల్ల మంచి నిద్రపడుతుంది.

-  పొలం పనిచేసేవారు, ఫ్యాక్టరీలో పనిచేసే వారు సాయంత్రం  గోరువెచ్చని నీటితో స్నానం చేసి 10 గం.లోపు నిద్రకు ఉపక్రమించాలి.