గోమాతనూ వదలని ఓటు బ్యాంకు రాజకీయం!


దేశంలో గోవధ నిషేధం అత్యధిక ప్రజల ఆకాంక్ష. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో కూడా దీనిపై విస్తృత చర్చలు జరిగాయి. దేశంలో సంపూర్ణ గోవధ నిషేధం జరగాలని, దీనికి రాజ్యాంగ భద్రత ఉండాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గోవధ నిషేధం అంశాన్ని మతపరమైన అంశంగా పరిగణించి, మరొక వర్గాన్ని సంతృప్తిపరచేందుకు అప్పటి కాంగ్రెస్‌  నేతృత్వంలోని రాజకీయ వ్యవస్థ దీనిని 'కోతి పుండు బ్రహ్మరాక్షసి'లా తయారు చేసింది. వివిధ స్థాయిల్లో కోర్టులు కూడా వివిధ సందర్భాలలో ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం చెప్పకుండా తాత్సారం చేశాయనే చెప్పుకోవాలి.

జంతు హింస నిరోధక (సజీవ జంతువుల మార్కెట్‌ నియంత్రణ) చట్టం కింద 23 మే 2017న కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలను జారీ చేసింది. గతంలో సుప్రీం కోర్టు చేసిన కొన్ని సూచనలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను ఇచ్చింది. ఇందులో ప్రధానంగా పశువుల సంతలో ఆవులు, ఎద్దులు తదితర జంతువులను, పశువులను వధశాలలకు అమ్మకుండా నిషేధం విధించారు. ఈ అంశాన్ని సంకుచిత రాజకీయకోణంలోంచి చూస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఇది గోవధ నిషేధాన్ని పరోక్షంగా అమలుచేయడమే అంటూ నానా యాగీ చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు నడిరోడ్ల మీద ఆవులను చంపి వాటి పచ్చి మాంసం తింటూ ఫొటోలకు పోజులిచ్చి నిరసనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఈ ఆదేశాలను బాహాటంగా వ్యతిరేకించారు. మద్రాస్‌ హైకోర్టు ఈ ఆదేశాలపై నాలుగు వారాల పాటు 'స్టే' మంజూరు చేసింది. 'సెక్యులరిజం' పదానికి అర్థం తెలియని ఓ వర్గం మీడియా సంస్థలు రోజుల తరబడి ఈ దృశ్యాలు చూపిస్తూ గంటల తరబడి చర్చా వేదికలు నిర్వహించాయి. జంతుహింసకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను ఒక జాతీయ సంక్షోభంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి.

భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో సంపూర్ణ గోవధ నిషేధం ప్రముఖ అంశంగా పలుసార్లు చర్చకు వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాణ సమితి (Constituent Assembly)లో సభ్యుడైన గోపాల్‌దాస్‌ దీన్ని ద్వాపరయుగం (కృష్ణుడి కాలం) నుంచి వస్తున్న నాగరికతకు సంబంధిం చిన అంశంగా పేర్కొంటూ దేశంలో సంపూర్ణ గోవధ నిషేధం విధించాలని వాదించారు. అంటరానితనం నిర్మూలన అంశంలానే గోవధ నిషేధం అంశాన్ని పరిగణిస్తూ దీన్ని రాజ్యాంగం లోని మౌలిక హక్కుల కింద పొందుపరచాలని ఆయన కోరారు. రాజ్యాంగ నిర్మాణ సమితిలోని ఇతర సభ్యులు శిబ్బన్‌లాల్‌ సక్సేనా, ఠాకూర్‌దాస్‌ భార్గవ, రామ్‌నారాయణ్‌ సింగ్‌, రామ్‌సహాయ్‌, రఘువీరా, ఆర్‌.వి.దులేకర్‌, చౌదరి రణ్‌బీర్‌సింగ్‌ తదితరులు సంపూర్ణ గోవధ నిషేధాన్ని సమర్ధిం చారు. వ్యవసాయక దేశమైన భారత్‌లో పశుసంపదను కాపాడుకోవాలని, వాటిని వధించకుండా చూస్తేనే దేశ ఆర్థికస్థితి బాగుంటుందన్నది వీరి వాదన. దేశంలో సంపూర్ణ గోవధ నిషేధాన్ని అమలు చేయడం ఇష్టం లేని కాంగ్రెస్‌లోని కొంతమంది నాయకులు ఒక విచిత్రమైన వాదన తీసుకువచ్చారు. రాజ్యాంగంలోని మౌలిక హక్కులు మనుషులకు మాత్రమే ఉంటాయని పశువులను మౌలిక హక్కుల శ్రేణిలోకి తీసుకురాలేమని వాదించారు. చివరకు ప్రజా ఒత్తిడికి లొంగిన కాంగ్రెస్‌ నాయకులు గోహత్యా నిషేధాంశాన్ని నిర్దేశక సూత్రాల కింద (Directive Principles) చేర్చడానికి అంగీకరించారు. ఎట్టకేలకు నిర్దేశక సూత్రాలలోని ఆర్టికల్‌ 48 కింద చేర్చిన ఈ అంశంలో భారత ధార్మిక భావనలను తప్పించారు. పశుసంతతి పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ యోగ్యమైన, ఆర్థిక అవసరాలు తీర్చే పశువులను వధించకుండా చూడాలని ఇందులో పేర్కొన్నారు.