భారత్‌లో 'కలిసిన' జమ్మూకశ్మీర్‌


జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక స్వయంప్రతిపత్తికి సంబం ధించిన ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభ్యలో ప్రతిపాదించన ఆర్టికల్‌ 370 రద్దు ప్రతిపాదన బిల్లు భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌. వెనువెంటనే ఆమోదిస్తూ జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

జమ్మూకశ్మీర్‌ను భారతదేశంతో సంపూర్ణంగా అనుసంధానించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఇకపై భారత రాజ్యాంగం మొత్తం జమ్మూకశ్మీర్‌లో అమలవుతుందన్నారు. మూడు కుటుంబాలు కలిసి జమ్మూకశ్మీర్‌ను దోచుకున్నాయన్నారు. 370 కారణంగా కశ్మీర్‌కు చెందిన అనేకమంది దరిద్రంలో జీవిస్తున్నారని, దీనిని అడ్డం పెట్టుకొని కొన్ని కుటుంబాలు అక్కడి ప్రజలను దోచుకొన్నాయని అమిత్‌ షా తెలిపారు.

''మహారాజ హరిసింగ్‌ చేత భారత్‌లో కలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేశారు. అప్పట్లో ఆర్టికల్‌ 370 లేదు. ఆ తర్వాత వచ్చింది. ఆర్టికల్‌ 370 జమ్మూకశ్మీర్‌ను భారత్‌తో కలవనివ్వ లేదు. కశ్మీర్‌ను అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేశాయి. మోదీ ప్రభుత్వానికి ఆ అవసరం లేదు. సభ్యులు అందరూ చర్చించాలి. ఆర్టికల్‌ 370 వచ్చాకే కశ్మీర్‌లో అరాచకాలు మొదలయ్యాయి. కశ్మీర్‌లో దళితులకు రిజర్వేషన్లు దక్కలేదనే విషయం దేశానికి తెలియాలి. కశ్మీర్‌లోకి వెళ్ళే అత్యధిక నిధులు ఎక్కడి పోతున్నాయో చర్చించాలి. నేను ప్రతి దానికి సమాధానం ఇస్తాను. ఆర్టికల్‌ 370 తొలగించ డంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు.'' అని అమిత్‌ షా రాజ్యసభలో పేర్కొన్నారు.

కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌, లఢక్‌

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే అధికరణం 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న కశ్మీర్‌ అసెంబ్లీ ఇప్పుడు కొత్తగా ఏర్పడే జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతపు అసెంబ్లీగా ఉంటుంది. లఢక్‌ మాత్రం అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది.

అధికరణం 370 రద్దును ఆహ్వానించిన ఆర్‌ఎస్‌ఎస్‌

జమ్మూకశ్మీర్‌తోపాటు యావత్తు జాతి ప్రయోజ నాలకు ఎంతో అవసరమైన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు మేము ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రతిఒక్కరు ప్రభుత్వపు ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి.

- డా. మోహన్‌ భాగవత్‌, సర్‌ సంఘచాలక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌

- సురేశ్‌ (భయ్యాజీ) జోషి, సర్‌ కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇవీ జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన మార్పులు

1.     జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగం రద్దయింది.

2.     జమ్మూకశ్మీర్‌కు విడిగా జెండా ఏది ఉండదు.

3.     జమ్మూకశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది.

4.     జమ్మూకశ్మీర్‌లో అమలులో ఉన్న ఆర్టికల్‌ 35ఏ రద్దయింది.

    ఇక దళితులు, పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి వచ్చిన శరణార్ధులు, గూర్ఖాలు, మహిళలకు కూడా పూర్తి హక్కులు లభిస్తాయి.

5.     జమ్మూకశ్మీర్‌లోని షెడ్యూల్‌ జాతులవారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు లభిస్తాయి.

6.     మూడంచల పంచాయతీ రాజ్‌ వ్యవస్థ జమ్మూ కశ్మీర్‌లో కూడా అమలవుతుంది.

7.     రాజ్యాంగపు పీఠికలో పేర్కొన్న అన్నీ అంశాలు ఇక జమ్మూకశ్మీర్‌కు కూడా వర్తిస్తాయి. ఇంతకు ముందు పీఠికలోని సెక్యులర్‌, అఖండత అనే పదాలు ఈ ప్రాంతానికి వర్తించేవి కాదు.

8.     భారత రాజ్యాంగం ఇచ్చిన విద్యా హక్కు ఇక ఈ ప్రాంతంలోని వారికి కూడా లభిస్తుంది.

9.     జమ్మూకశ్మీర్‌ శాసన సభ కాలవ్యవధి 6 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 5 సంవత్స రాలు ఉంటుంది.

10. జమ్మూకశ్మీర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించే న్యాయమూర్తులు, మంత్రుల ప్రమాణస్వీకార పత్రంలో ఇక మీదట భారతీయ రాజ్యాంగం పట్ల నిష్టతో అనే మాట చేరుస్తారు.

11. మిగిలిన బలహీన, వెనుకబడిన వర్గాలకు కూడా జమ్మూకశ్మీర్‌లో హక్కులు లభిస్తాయి.

12. జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడున్న గవర్నర్‌ బదులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి ఉంటుంది.

13. ప్రస్తుతపు జమ్మూకశ్మీర్‌ ప్రాంతాన్ని ఇక రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పరిగణిస్తారు.

    1. జమ్మూకశ్మీర్‌, 2. లఢక్‌

14. ఇక దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఎవరైనా జమ్మూకశ్మీర్‌కు వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచు కోవచ్చును.