భారతీయ చరిత్రలో మహిళ


సమాజంలో స్త్రీ నిర్వహించాల్సిన పాత్ర గురించి భారతీయ, పాశ్చాత్య దృష్టిలో ఎంతో తేడా ఉంది. భారతీయ సమాజంలో స్త్రీ, పురుషులది పరస్పర పూరకమైన పాత్ర. మన చరిత్రలో మరుగున పడిన అనేక విషయాలను వెలికి తీయ గలిగితే సమాజంలో ప్రముఖ పాత్ర నిర్వర్తించిన మహిళల గురించి కూడా తెలుస్తుంది. స్త్రీ, పురుషుల చరిత్ర విడివిడిగా ఉండదు''అని గోవా గవర్నర్‌ శ్రీమతి మృదుల సిన్హా అన్నారు.

భాగ్యనగర్‌లో ఇతిహాస సంకలన సమితి అధ్వర్యంలో ఆగస్ట్‌ 17,18ల్లో జరిగిన 'భారతీయ చరిత్రలో మహిళలు' అనే అంశంపై జరిగిన సెమినార్‌ ప్రారంభ సమావేశంలో మృదుల సిన్హా పాల్గొన్నారు.

బిహార్‌ లోని మిథిలాచల్‌ ప్రాంతానికి చెందిన మృదుల 'మై సీతా హు' (నేను సీతను)అనే పుస్తకం వ్రాసారు. ప్రతి మహిలలోను సీతా, సావిత్రులు ఉంటారని ఆమె అన్నారు.

రాష్ట్ర సేవికా సమితి అఖిలా భారతీయ సంచాలిక వందనీయ శాంతక్క మాట్లాడుతూ వేద, పురాణ కాలంలో పండితులు, ఋషులలో అనేక మంది మహిళలు కనిపిస్తారని అన్నారు. సూర్య ఋషిక దర్శించిన అనేక మంత్రాలను ఇప్పటికీ మన వివాహ సంప్రదాయాల్లో ఉపయోగిస్తున్నామని తెలియజేశారు. శాతవాహన రాణి అయిన నాగరిక ప్రపంచంలోనే మొట్టమొదటి రాణి అని ఆమె తెలియజేశారు. విదేశీ దాడులు, ఇతర సమస్యల మూలంగా మన సమాజంలో మహిళా స్థానం, హోదా తగ్గిందని, ప్రాచీన భారతీయ దృష్టిని అర్ధంచేసుకుని మహిళలకు తిరిగి సముచితమైన స్థానం కలిగించుకోవాలని వందనీయ శాంతక్క అన్నారు.

 రెండు రోజులపాటు జరిగిన ఈ సెమినార్లో 200 మందికి పైగా మహిళా విద్యావేత్తలు వివిధ అంశాలపై పత్రాలు సమర్పించారు.