టీటీడీ పుస్తకాల్లో అన్యమత సాహిత్యంతిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రచురించిన పుస్తకాల్లో అన్యమత సాహిత్యం వెలుగు చూడటం వివాదాస్పదమైంది. 'భక్తి గీతామృత లహరి' పేరుతో ధవళేశ్వరానికి చెందిన మెండా చిన సీతారామయ్య రాసిన పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తమ ఆర్ధిక సాయంతో అచ్చు వేశారు. ఆ పుస్తకం కాపీని టీటీడీ అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచారు. అయితే అందులో హిందూ దేవుళ్ళకు సంబంధించిన పద్యాలతో పాటుగా ఏసు క్రీస్తును స్తుతిస్తూ పద్యాలు ఉండటం వివాదానికి దారితీసింది. లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీటీడి తమ వెబ్సైట్లో ఉన్న ఈ పుస్తకాన్ని తొలగించింది.

ఈ ఘటన వెలుగు చుసిన కొద్దిసేపట్లోనే టీటీడీ వెబ్సైట్లో 'ఆర్ష జ్యోతి' అనే మరొక పుస్తకంలో ఇస్లాం, క్రైస్తవ సూక్తులు కనిపించాయి. రమణ మహర్షి ఆలోచనలను ఉటంకిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఉదంతంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి అనిల్‌ సింఘాల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీటీడీ అధికారి వెబ్సైట్లో అప్లోడ్‌ చేసిన పుస్తకాల పరిశీలన కొనసాగిస్తున్నామని, అన్యమత సాహిత్యాన్ని తొలగిస్తామని తెలియజేసారు.