శక్తివంతులం, జ్ఞానవంతులం కావాలి - భాగ్యనగర్‌ గణేశనిమజ్జనోత్సవంలో సర్‌ సంఘచాలక్‌ ఉద్బోధన


గణేశ పూజను కేవలం వేడుకలా, ఉత్సవంలా మార్చివేయకూడదు. దీని ద్వారా హిందువులంతా సంస్కారాలను, సద్గుణాలను అలవరచుకునే ప్రయత్నం చేయాలి. కేవలం మంచితనం ఉంటే సరిపోదు. దానితోపాటు శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి ఇతరులను హింసించడానికి కాకపోయినా ఇతరులు మనపై చేసే దాడిని ఎదుర్కొనేందుకు అవసరం. అలాంటి శక్తితోపాటు జ్ఞానం కూడా అవసరమని గణేశుడు మనకు చెపుతున్నాడు. ఈ గణేశ ఉత్సవాల ద్వారా హిందువులంతా ఈ గుణాలను అలవరచుకుని, సంఘటిత శక్తిగా నిలవాల''ని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌ అన్నారు. 
భాగ్యనగర్‌లో గణేశ నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన గణేశ్‌ చౌక్‌ (మొజంజాహీ మార్కెట్‌ కూడలి) వద్ద భక్త సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జగదంబ, శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని పూజించి గణేశుడు విశ్వాధిపత్యాన్ని పొందాడని, మనం జగదంబ స్వరూపమైన భారత మాత పూజలో జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని ఆయన ఉద్బో ధించారు. మన శక్తి, బుద్ధి భారత మాత భక్తి కోసమని, ఈ దేశంలోని జనం, జలం, జమీన్‌ (భూమి), జాన్వర్‌ (జంతువుతులు) మొదలైన వాటిపై మనకు భక్తి ఉండాలని ఆయన అన్నారు.

మనం ఎల్లప్పుడు జాగరూకతతో, అప్రమత్తంగా ఉండాలని, దేశాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు సమాజంలో విభేదాలు సృష్టించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయని హెచ్చరించారు. ప్రతి ఏడాది చేసే గణపతి పూజ ద్వారా మనం ఆయనలోని గుణాలను అలవరచుకునే ప్రయత్నం చేస్తామని, అందరి మేలు కోసం ఆ గుణాలను ఉపయోగించా లనే సందేశాన్ని కూడా గ్రహిస్తామని ఆయన అన్నారు. సర్వ శుభాలను చేకూర్చే గణేశుడు వచ్చే సంవత్సరం మరింత ముందుగా రావాలని కోరుకుందామని ఆయన తన ఉపన్యాసాన్ని ముగించారు. అంతకుముందు డా. మోహన్‌ భగవత్‌ చార్మినార్‌ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.