చిన్నతనంలోనే 'మహాపరీక్ష'లో నెగ్గాడు


ఆధునిక విద్యకే ప్రాధాన్యత, అవకాశం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో వేద విద్యను అభ్యసించ డానికి ఎంతో పట్టుదల, విశ్వాసం ఉండాలి. అటువంటి పట్టుదలనే చూపాడు గోవాకు చెందిన ప్రియవ్రత పాటిల్‌. 16 ఏళ్ల చిన్న వయస్సులోనే తెనాలి మహాపరీక్షలో ఉత్తీర్ణుడై ప్రధానమంత్రితో సహా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కనీసం 5,6 సంవత్సరాలు పట్టే ఈ పరీక్షను కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాడు.

భారతీయ సంస్కృతి బహుముఖమైనది. కాలానుసారంగా ప్రభావవంతమైన వ్యక్తులు వస్తూవుంటారు. మౌలిక, ప్రాధమిక గ్రంధాలైన మన వేదాలు, శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా వందలాదిమంది పండితులు ఈరోజుకూ ఆ సంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచు తున్నారు. మన సంప్రదాయ జ్ఞానానికి నిలయాలైన గురుకులాలు, గురుశిష్య పరంపర క్షీణిస్తున్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ మన ప్రాచీన జ్ఞానాన్ని నేటికీ సజీవంగా ఉంచే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు గోవాకు చెందిన ఈ 16 ఏళ్ళ యువకుడు 'ప్రియవ్రత పాటిల్‌'.

చాలా మంది కౌమారంలో  వినోదంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటారు కానీ ప్రియవ్రత ఎన్నో రాత్రులు కష్టపడి అత్యంత కఠినమైన శాస్త్రాలపై 'తెనాలి పరీక్ష' లో చాలా చిన్న వయస్సులో ఉత్తీర్ణుడైనాడు.

తెనాలి పరీక్షకి మహాపరీక్ష అని కూడా పేరు. కంచి మఠం వారి పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. ఈ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు 'న్యాయ, మీమాంస, వ్యాకరణ, అద్వైత, వేద భాష్య కంచి వేద వేదాంత శాస్త్ర సభ' వారిచే నిర్వహించ బడుతుంది.

ప్రియవ్రత అన్ని వ్యాకరణ మహాగ్రంధాల పై పరీక్ష రాశాడు, ఇది రెండు రకాలుగా ఉంటుంది. వ్రాత, మౌఖిక పరీక్షలు.

తెనాలి మహాపరీక్షలో 14 స్థాయిలు ఉంటాయి. 5,6 సంవత్సరాల కృషి తరువాతనే ఈ పరీక్షకి సిద్దం అవుతారు. కానీ ప్రియవ్రత కేవలం 2 సంవత్సరాలలోనే విజయవంతంగా పూర్తి చేశాడు. సెప్టెంబర్‌ 6 న తెనాలిలో అతను  ఈ పరీక్ష పూర్తిచేశాడు.

ఈ అద్భుత విజయాన్ని గుర్తించి స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోడీ అతనికి శుభాకాంక్షలు చెప్పారు.