భారతీయ మహిళ స్థితిగతులు


భారతదేశంలో మహిళల పరిస్థితి అధ్వా న్నంగా ఉందని, వారికి ఎలాంటి 'హక్కులు' లేవని, 'పురుషాధిక్య సమాజం' వారిని 'వంటింటి కుందేళ్ళు'గా మార్చేసిందని రకరకాల ప్రచారాలు, సిద్ధాంతాలు సాగుతున్నాయి. అయితే మన దేశంలో మహిళల స్థితిగతులు నిజంగా ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు దృష్టి అనే సంస్థ ఒక అధ్యయనం నిర్వహించింది.
'దృష్టి స్త్రీ అధ్యయన ప్రబోధన్‌ కేంద్ర' గత రెండు దశాబ్దాలుగా సమాజంలో మహిళల స్థితిగతుల గురించి అధ్యయనం చేస్తోంది. దేశం లోని అన్నీ రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అధ్యయనం జరిగింది. ఇటీవల కాలంలో మహిళల గురించి జరిపిన అధ్యయనంలో ఇది చాలా క్షుణ్ణమైనది. ఇందులో భాగంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన 43255 మంది మహిళలను ఇంటర్వ్యూ చేశారు. హిందూ, బౌద్ధ, జైన, సిఖ్‌, ముస్లిం, క్రైస్తవ మొదలైన ప్రధాన మతవర్గాలకు చెందిన మహిళల వివరాలు తీసుకున్నారు. 18 ఏళ్ల వయస్సు కలిగిన ఆడపిల్లల స్థితిగతులపైన కూడా అధ్యయనం చేశారు. దీని కోసం 25 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 7675 మంది ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం సేకరించారు.

ఈ అధ్యయనపు నివేదికను ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌ ఇటీవల విడుదల చేశారు. ఆ నివేదికలో ముఖ్యాంశాలు:

ఆనందం, సంతృప్తి

- ఆనందం, సంతృప్తి అత్యధికంగా, అధికంగా అనుభవిస్తున్న మహిళలు 80శాతం మంది ఉన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగానికి చెందిన మహి ళల్లో ఆనందం అందరి కంటే ఎక్కువగా ఉన్నది.

- అత్యధిక, అధిక ఆనందం పొందుతున్నా మనే మహిళల్లో ఎక్కువ శాతం వివాహితులు. మరోవైపు సహజీవనం చేస్తున్న మహిళలు జీవితంలో ఆనందం చాలా తక్కువగా ఉన్నదని చెప్పారు.

- అసలు ఆదాయం లేని, కుటుంబ ఆదాయం కూడా తక్కువగా ఉన్న మహిళలే చాలా ఆనం దంగా, ఆనందంగా ఉన్నారు. దీనినిబట్టి ఆనందం, తృప్తీ అనేవి కుటుంబ ఆదాయంపై ఆధారపడి ఉండవని స్పష్టమవుతోంది.

విద్య

- 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో మహిళల అక్షరాస్యత 64.63 శాతం. అయితే ప్రస్తుత అధ్యయనంలో అది 79.63 శాతంగా నమోదైంది. అక్షరాస్యతలో వృద్ధి కనిపించినా తక్కువమంది మాత్రమే డిగ్రీ వరకు చదువు పూర్తి చేశారని తేలింది.

- నిరక్షరాస్యత షెడ్యూల్‌ జాతులకు చెందిన మహిళల్లో ఎక్కువగా ఉంది. ఆ తరువాత స్థానాల్లో షెడ్యూల్‌ కులాలు, ప్రత్యేక వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు ఉన్నారు.

- మహిళలు చదువు మధ్యలో ఆపివేయడానికి ప్రధాన కారణాలు వివాహం, ఆర్ధిక ఇబ్బందులని అధ్యయనంలో తేలింది.

- రిజర్వేషన్‌ విధానం, విద్యాపరమైన సహకారం వల్ల షెడ్యూల్‌ కులాలు, తెగలు, ప్రత్యేక వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకబడిన తరగతుల మహి ళలు ఉన్నత విద్యా స్థాయిని అందుకోగలుగు తున్నారని స్పష్టమైంది.

ఉపాధి

- మహిళా ఉపాధి రేటు షెడ్యూల్‌ తెగల మహిళల్లో ఎక్కువగా ఉంటే నిరుద్యోగుల సంఖ్య 'ఇతర' కులాల్లో ఎక్కువ.

ఆరోగ్యం, పోషకాహారం

- సగానికి పైగా మహిళలు రోజుకు రెండు పూటలు భోజనం చేస్తున్నారు. కానీ 3.73శాతం మంది ఇప్పటికీ రోజులో ఒకసారే భోజనం చేస్తున్నారు. ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న మహిళల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ.

- 18ఏళ్ల లోపు ఆడపిల్లల్లో 64శాతం మంది ఋతుక్రమ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఆ తరువాత కీళ్లవాతంతో బాధపడుతున్నవారు 50శాతం ఉన్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఇంత చిన్న వయస్సు వారిలో కూడా అధిక రక్తపోటు (5.28%), గుండెకు సబంధించిన సమస్యలు(3.07%), చక్కెర వ్యాధి(1.62%), కాన్సర్‌(0.51%) మొదలైన సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు.

- 40 శాతం మంది మహిళలు గత రెండేళ్లలో ఏదో ఒక ఆరోగ్య సమస్యతో హాస్పిటల్‌ లో చేరారు. ఇలా ఆసుపత్రిలో చేరుతున్నవారి సంఖ్య 18-20 మధ్య వయస్సు వారిలో ఎక్కువ.

- వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో గిరిజన ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు.