విజయదశమి - దీపావళి


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయదశమి. విజయదశమి శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఉత్సవం. శ్రీరాముడు రావణునిపై విజయం సాధించిన రోజు. పాండవులు వనవాసం, అజ్ఞాత వాసం పూర్తయిన తర్వాత తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై నుండి దించిన రోజు. జగన్మాత మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్దం చేసి జయంచిన పదవ రోజుగా విజయదశమి పర్వదినం ప్రసిద్ధి.

తెలంగాణా ప్రాంతంలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. కర్ణాటక, బెంగాల్‌, ఒడిషాతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలలో విజయదశమి భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారు. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతంలో హెచ్చుగా ఉంటుంది. విజయదశమి రోజు ఏ కార్యం ప్రారంభించినా విజయవంతం అవుతుందని హిందువుల అపార విశ్వాసం.

హిందూ రాష్ట్ర నవోదయానికి నాందీ వాచకుడు  డాక్టర్‌ కేశవరావు బలిరామ్‌ హెడ్గేవార్‌ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ప్రారంభించిన రోజు కూడా విజయదశమి కావటం విశేషం.

నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు తరలివెళ్తాడు. భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ నరకాసురుని సంహరిస్తుంది. ఆ రోజున చతుర్దశి, తరువాత రోజు అమావాస్య కావటంతో ప్రజలు చీకటిని పారద్రోలటానికి దీపాలతో అలంకరించి ''దీపావళి'గా జరుపుకొన్నారు. విజదశమి మరియు దీపావళి మాతృశక్తి ప్రదర్శనకు సనాతన ధర్మంలో ప్రతీకలు. భారతీయ సంస్కృతికి వర్గ విభేదాలను విస్మరించి ఆనందంగా జరుపుకొంటారు.