ధన్వంతరి జయంతి


భాగవతం అష్టమ స్కందంలో ''క్షీర సాగర మధనం'' సమయములో ''ధన్వంతరి'' ఆవిర్భావం జరిగిందని వర్ణించబడింది. ముందుగా హలాహలం ఉద్భవించింది. దానిని పరమ శివుడు తన కంఠంలో దాచాడు. వరుసగా కామదేనువు, ఐరావతం, పారిజాతం, ఆవిర్భవించాయి. తరువాత లక్ష్మీదేవి అవత రించింది. చివరిగా ధన్వంతరి అవతరించాడు. 
సాగర గర్భం నుండి ఒక పురుషుడు పీతాంబరదారియై, మణి కుండలాలు ధరించి, పుష్ప మాలాంకృతుడై, చేతిలో అమృత కలశాన్ని దాల్చిన వాడు అవిర్భవించాడు. అతడే ధన్వంతరి. ఆయన శ్రీ మహావిష్ణువు అంశలో జన్మించినవాడని, ఆయుర్వేద జ్ఞానాన్ని కలిగినవాడు,  మహానీయుడు అని బ్రహ్మాదులు ధన్వంతరి అని నామకరణము చేశారు.

మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే దోషాలు, రోగాలు, వికృతులను నివారించే ఆయుర్వేద శాస్త్రాన్ని అందించిన వాడుగా శాస్త్రాలు తెలియ జేస్తున్నాయి. బ్రహ్మ వైవర్త పురాణం సూర్యుని వద్ద ధన్వంతరి ఆయుర్వేదం అభ్య సించినట్లుగా తెలియజేస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి. కేరళలోని ''నెల్లవాయ'' అనే గ్రామంలో ధన్వంతరి ఆలయం ఉంది. ''కాలికట్‌''లో కూడా మరో పురాతన ఆలయం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని చింత లూరులో ఒక ధన్వంతరి మందిరం ఉంది.

2016వ సంవత్సరములో భారత ప్రభుత్వం ధన్వంతరి జయంతిని ''జాతీయ ఆయుర్వేద దినోత్సవం''గా ప్రకటించింది.