కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్ముకశ్మీర్‌, లడఖ్


370వ అధికరణం సవరించడంతో ప్రత్యేక హోదా రద్దయిన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించింది. అక్టోబర్‌ 31 నుంచి జమ్ముకశ్మీర్‌, లడఖ్ లు రెండు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల పర్యవేక్షణలో ఉండే ఈ కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన బాధ్యతలు పూర్తిగా కేంద్రం చేపట్టింది.

రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని ఏర్పరచడం వల్ల కలిగే మార్పులు-

1. భారత్‌లో రాష్ట్రాల సంఖ్య ఒకటి తగ్గి 28 అవుతుంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య రెండు పెరిగి తొమ్మిది అవుతుంది.

2. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి పాండిచ్చేరి మాదిరిగా శాసన సభ ఉంటుంది. అయితే లడఖ్‌ మాత్రం చండీగఢ్‌ మాదిరిగా శాసన సభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది.

3. జమ్ముకశ్మీర్‌కు జి.సి. ముర్ము, లడఖ్‌కు ఆర్‌కె మాథుర్‌లు లెఫ్టినెంట్‌ గవర్నర్‌లుగా వ్యవహరిస్తారు.

4. ఇప్పటివరకు అమలులో ఉన్న జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక రాజ్యాంగం, రణబీర్‌ కోడ్‌ రద్దయ్యాయి.

5. కేంద్రపాలిత ప్రాంతం కావడంవల్ల జమ్ము కశ్మీర్‌లో పోలీసు, శాంతిభద్రతల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. అయితే భూమి మాత్రం అక్కడి ఎన్నికైన ప్రభుత్వం చేతిలో ఉంటుంది.

6. జాతీయ సమైక్యత కోసం పాటుపడిన మొదటి హోమ్‌ మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జయంతిని పురస్కరించుకుని పాటించే జాతీయ సమైక్యతా దినోత్సవం సంధర్భంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను అధికారికంగా గుర్తించారు.

జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లు కేంద్రపాలిత ప్రాంతా లుగా గుర్తింపు పొందడంతో కేంద్ర ఎన్నికల సంఘం జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వి భజన ప్రక్రియను ప్రారంభిస్తుంది. జమ్ముకశ్మీర్‌ పునర్విభజన చట్టం, 2019 ప్రకారం ఇక ఇక్కడి శాసన సభలో 114 స్థానాలు ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు కావడంవల్ల జమ్ము కశ్మీర్‌, లడఖ్‌లలో అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉంది. కొత్త జాతీయ రహదారులు, రైల్వే మార్గాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు వస్తాయి. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న రేడియో కశ్మీర్‌ను ఇక నుంచి ఆకాశవాణిగా గుర్తిస్తారు.