బీహార్‌ వరద బాధితులను ఆదుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌


గత నెల బీహర్‌లో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్వయంసేవకులు సేవా, సహాయక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. వరద తాకిడి ప్రాంతాల్లో వందలాది మంది స్వయంసేవకులు నిర్విరామంగా వరదభాదితులకు సేవ చేశారు. వందలాది కుటుంబాలను వరద తాకిడి నుండి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూత్‌నాథ్‌ రోడ్‌, మున్నాచౌక్‌, డాక్టర్స్‌ గోలంబార్‌, వైశాలి గోలంబార్‌ ప్రాంతా లలో వరద భాదితుల కోసం తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు.

150 మందికి పైగా స్వయంసేవకులు 12 బృందాలుగా ఏర్పడి వరద ముంపు ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీటిలో 10 బృందాలు అవసరమైన వారికి, సహాయపడే నిత్యావసర వస్తువులు పంచారు. పదివేలకు పైగా ఆహారపొట్లాలు, నాలుగు వేలకు పైగా రొట్టెలు, రెండువేలకుపైగా పాల ప్యాకెట్లు భాధితులకు అందించారు. అలాగే అవసరమైన వారికి 100 ప్యాకెట్ల కొవ్వొత్తులు, 500 ప్యాకెట్ల పప్పుదినుసులు, 10 పెద్దడబ్బాలలో బిస్కట్లు అందించారు. వందలాది మంది స్వయంసేవకులు రోడ్డు మార్గంలో వాహనాలు కదిలేందుకు ట్రాఫిక్‌ రద్దీని క్రమబద్దీకరించారు. వరదనీరు తగ్గు ముఖం పట్టిన తరువాత అంటు వ్యాధులు ప్రబలకుండా తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైన మందులను స్వయంసేవకులు అందించారు.