స్వాభిమానం, స్వావలంబనతోనే దేశప్రగతి సాధ్యంఆర్‌ఎస్‌ఎస్‌ విజయదశమి ఉత్సవంలో పరమపూజనీయ సర్‌ సంఘచాలక్‌ డా. శ్రీ మోహన్‌ జీ భాగవత్‌ ఉపన్యాస సారాంశం

ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తూ, దేశ హితం కోసం వాటిని పూర్తిచేయాలనే ధోరణి, సాహసం రెండోసారి ఎన్నికైన ప్రభుత్వంలో ఉన్నదనే విషయం అధికరణం 370 సవరణతో స్పష్టమైంది. ఇతర పార్టీల మద్దతు కూడ గట్టుకుని, రెండు సభల్లోనూ మూడింట రెండు వంతుల ఆమోదంతో, సామాన్య ప్రజానీకపు ఆకాంక్షను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించింది. 
ఇందుకు ప్రధానమంత్రి, గహామంత్రితో పాటు అధికార పక్షం మొత్తం, అలాగే ప్రజల అభిష్టాన్ని గుర్తించి మద్దతు తెలిపిన ఇతర పార్టీలు కూడా అభినందనపాత్రమైనవి. అయితే అధికరణం 370 మూలంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం అంతమై, న్యాయం జరిగినప్పుడే ఈ పని పూర్తవుతుంది.  అలాగే అక్కడ నుంచి అన్యాయంగా తరిమివేతకు గురైన కాశ్మీరీ పండిట్‌ల పునరావాసం, వారికి సురక్షితమైన జీవనం లభించినప్పుడే పూర్తవుతుంది. ఇప్పటి వరకు కాశ్మీరీ ప్రజలకు అందకుండా పోయిన హక్కులు, అధికారాలు లభించాలి. అలాగే అధికరణం 370 తొలగింపువల్ల తమ భూములు, ఉద్యోగాలు పోతా యని, తాము పెను ప్రమాదంలో పడిపోతామన్న ప్రజల భయాందోళనలు కూడా తొలగి మిగిలిన దేశ ప్రజానీకంతో వారు సాదరాపూర్వకంగా కలవగలగాలి. కలిసి దేశాభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించగలగాలి.

కొన్ని సంవత్సరాలుగా భారతీయుల ఆలోచనలో మార్పు వచ్చిందని మనకు అనిపిస్తుంది. అలాంటి మార్పును వ్యతిరేకించేవారు దేశంలోనూ ఉన్నారు, బయటా ఉన్నారు. భారత్‌ అభివృద్ధి సాధించడం వల్ల తమ స్వార్ధ ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం ఎవరిలో కలుగుతోందో ఆ శక్తులకు ఈ దేశం శక్తివంతం కావడం కూడా ఇష్టం ఉండదు. దురదృష్టవశాత్తు భారతీయ సమాజంలో ఏకాత్మత, సమానత్వం, సమరసత ఏ స్థాయిలో ఉండాలో అలా ప్రస్తుతం లేవు. ఈ లోటును ఆసరాగా తీసుకుని ఈ శక్తులు తమ కార్యకలాపాలు ఎలా సాగిస్తున్నాయో మనం చూస్తున్నాం. జాతి, ప్రాంతం, భాష, మొదలైన అంశాలను ఆధారం చేసుకుని సమాజంలో భేదభావాన్ని పెంచడం, పరస్పరం విద్వేషాన్ని రెచ్చగొట్టడం, ఈ వైమనస్యం, వేర్పాటు వాదం ద్వారా ప్రత్యేక అస్తిత్వాలను, వర్గాలను రూపొందించడం, ఈ దేశపు చిరంతన సామాజిక ప్రవాహంలో వేరువేరు, ప్రతికూల ప్రవాహాలను సష్టించడం కోసం ఈ శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ కుతంత్రాలను గుర్తించి, వాటిని సైద్ధాంతిక, సామాజిక స్థాయిల్లో నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యలు, అమలుచేసే విధానాలను వక్రీకరించి, దుర్వ్యాఖ్యలు చేసి తమ దుష్ట ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నం కూడా ఈ శక్తులు చేస్తాయి. అందువల్ల నిత్య జాగురుకతతో వ్యవహరించడం అవసరం. ఇలా న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ పట్ల అవిశ్వాసాన్ని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దీనికి అన్ని స్థాయిల్లో సమాధానం చెప్పాలి.

ఒక వర్గానికి చెందినవారు మరొక వర్గానికి చెందిన వ్యక్తులపై మూకదాడులకు పాల్పడు తున్నారంటున్న వార్తలు తరచుగా మన పత్రికల్లో చూస్తున్నాం. అయితే ఇలాంటి దాడులు కేవలం ఒక వర్గానికి చెందివారు మాత్రమే చేస్తున్నారన్నది నిజం కాదు. రెండు వైపుల నుంచి ఇలాంటి దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగు తున్నాయి. కొన్నిసార్లు ఇలాంటి దాడులు యోజనబద్ధంగా చేయిస్తున్నారు. కొన్నిసార్లు గోరంతను కొండంతలుగా చూపిస్తున్నారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి హింసాత్మక సంఘటనలవల్ల సమాజంలో వివిధ వర్గాల మధ్య పరస్పర సంబంధాలు ప్రభావితమవు తాయన్న సంగతి గుర్తించాల్సిందే. ఇలాంటి ప్రవృత్తి మన దేశ పరంపర కాదు. అలాగే మన రాజ్యాంగం దీన్ని అనుమతించదు. ఎన్ని విభేదాలున్నా, ఇతరులు ఎంతగా రెచ్చగొట్టినా చట్టపరిధికి లోబడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచి పోలీసుల ద్వారానే సమస్యను పరిష్కరించు కోవాలి. స్వతంత్ర దేశపు పౌరులు విస్మరించకూడని బాధ్యత ఇది. ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడేవారికి సంఘ్‌ ఎప్పుడు మద్దతు తెలుపలేదు, తెలుపదు కూడా. ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి స్వయంసేవకులు ఎప్పుడూ ప్రయత్నిస్తారు. కానీ భారతీయ పరంపరలో లేని ఈ మూకదాడులను ఇక్కడ సర్వసాధారణ విషయమని, ఇక్కడి పరంపర అని చూపడానికి 'లించింగ్‌' అంటూ ప్రచారం చేయడం, దేశానికి, ముఖ్యంగా హిందూ సమాజానికి ఈ అపవాదును అంటగట్టడానికి, అల్ప సంఖ్యాకుల్లో భయాందోళనలు కలిగించడానికి జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను అందరూ అర్ధంచేసుకోవాలి.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో వచ్చిన మాంద్యం సర్వత్ర ప్రభావం చూపుతుంది. అమెరికా, చైనాల మధ్య సాగిన వాణిజ్య యుద్ధపు ప్రభావం భారత్‌తో సహా అన్నీ దేశాలపై ఉంటుంది. ఈ మాంద్యపు స్థితి నుంచి బయటపడటానికి ఆర్ధిక శాఖ గత నెలలో అనేక చర్యలు చేపట్టింది. ప్రజాహితం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, క్రియాశీలమైన వ్యవాహర శైలి దీని వల్ల స్పష్టమవుతుంది. ప్రస్తుతపు ఆర్ధిక మాంద్యపు వలయం నుంచి మనం తప్పక బయటపడతాం. అలా చేయడానికి మన ఆర్ధిక వేత్తలకు పూర్తి సామర్ధ్యం ఉంది.

ఆర్ధిక స్థితిని చక్కదిద్దే ఒత్తిడిలో స్వదేశీ భావనను మరచిపోవడం కూడా నష్టానికి దారి తీస్తుంది. 'స్వదేశీ' నిత్యజీవితంలో దేశభక్తి ప్రకటిత రూపమని దత్తోపంత్‌ థేంగ్డే అన్నారు. ఆచార్య వినోబా భావె దానిని 'స్వాభిమానం', 'అహింస' అని అభివర్ణించారు. ఏ ఆర్ధిక సూత్రాలు, ప్రమాణాల ప్రకారం చూసినా ఏ దేశం స్వయంసమృద్ధి, స్వావలంబన సాధిస్తుందో, ప్రజలందరికీ ఉపాధి చూపగలుగుతుందో ఆ దేశం మాత్రమే అంతర్జా తీయ వాణిజ్య సంబంధాలను విస్తరించుకోగలదని, మొత్తం మానవాళికే సురక్షితమైన, సుదృఢమైన భవిష్యత్తును అందించగలదని తెలుస్తుంది. మన దేశపు ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు బాహ్యమైన ఒత్తిడులకు లొంగకుండా, ఎక్కువ కాలం పట్టేదైనా స్వీయ బలం, సామర్ధ్యం పైనే ఆధారపడి మన లక్ష్యాన్ని, ప్రయాణాన్ని నిర్ణయించుకోవాలి.

స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల తరువాత కూడా మనం 'స్వ' ఆధారిత విధానాన్ని రూపొందించుకోవడంలో విఫలమయ్యాం. దీనికి కారణం మన విద్యావిధానం. మనలను బానిసలుగా ఉంచడానికి విదేశీ పాలకులు ప్రవేశపెట్టిన విద్యావిధానాన్నే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగించాం. కనుక భారతీయ దృక్పధానికి అనుగుణమైన విద్యా విధానాన్ని, ప్రణాళికను మనం రూపొందించుకోవాలి. విద్యారంగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలను గమనిస్తే 'స్వ' ఆధారిత విధానాన్ని రూపొందించుకోవడం వల్లనే అవి ఆ స్థితిని సాధించగలిగాయని అర్ధమవుతుంది. అందువల్ల స్వభాష, స్వభూష (దేశీయ కట్టు), స్వ సంస్కృతి పట్ల గౌరవాన్ని, పూర్తి అవగాహనను కలిగించి ప్రపంచంలోని సర్వ ప్రాణులపట్ల ప్రేమ, సహానుభూతిని కలిగించగలిగే విద్యావిధానం అవసరం. ఉపాద్యాయుల శిక్షణ ప్రణాళికలో కూడా సమూలమైన మార్పులు అవసరం.

విద్యా విధాన లోపాలతోపాటు సమాజ జీవనంలో సాంస్కృతిక, నైతిక విలువలు తరిగి పోవడం, అనైతిక ధోరణి పెరగడం కూడా ప్రధాన సమస్యలు. 'మాతృవత్‌ పరదారేషు' (పర స్త్రీ తల్లితో సమానం) అనే భావనతో స్త్రీని గౌరవించిన ఈ దేశంలో, స్త్రీ గౌరవాన్ని నిలపడం కోసం మహా యుద్ధాలకు కూడా వెనుకాడరాదన్న ఇతివృత్తాలు కలిగిన రామాయణ, మహాభారతాలవంటి ఇతిహాసాలు ఉన్న దేశంలో, పవిత్రతను కాపాడు కునేందుకు స్త్రీలు 'జోహర్‌' ద్వారా అమరులైన దేశంలో మహిళలకు అటు సమాజంలోనూ, ఇటు కుటుంబంలోనూ భద్రత కరువయ్యింది. ఇది మనందరికీ అవమానకరమైన విషయం. మాతృ మూర్తులు జ్ఞానవంతులై సాధికారత సాధించేట్లుగా,  స్వీయరక్షణ సామర్ధ్యం సంపాదించుకునే విధంగా చూడాలి. పురుషులలో మహిళల పట్ల మన సాంస్కృతిక విలువలైన పవిత్ర, గౌరవ భావాలను కలిగించాలి. 

సమాజంలో విలువల పతనం, అడ్డు అదుపు లేని అవినీతికి ప్రధాన కారణం సాంస్కృతిక విస్మృతి, క్షీణత. దీనిని సవరించడానికి అనేక చట్టాలు అమలు చేస్తూ ఉంటారు. అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తూ ఉంటారు. వ్యవస్థలో పైనుంచి ప్రక్షాళన, సవరణ చర్యలు చేపట్టిన కింది స్థాయిలో అవినీతి పద్దతులు కొనసాగే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ సవరణ చర్యలనే ఆసరాగా తీసుకుని అవినీతిని విస్తరింపచేస్తున్నారు కూడా. అలాగే చట్టాలను గౌరవించేవారు, నియమాలను అనుసరించేవారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాంటి అర్హత లేకుండా, సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాశ మన మనస్సుల్లోకి ప్రవేశించింది. ఇదే సకల అవినీతికి మూలం. కుటుంబ స్థాయిలో ఆదర్శవంతమైన, నైతికమైన జీవనశైలిని అనుసరించడం సమాజ పరివర్తనకు తద్వారా దేశ సౌభాగ్యానికి చాలా అవసరం.

హిందూ అనే పదం, శబ్దం కేవలం తమను తాము హిందువులమని గుర్తించేవారో, పరిగణించు కునేవారికో పరిమితమైనది కాదు. ఎవరు ఈ దేశ వాసులో, ఎవరి పూర్వజులు భారతీయులో, ఎవరు ఈ దేశ ఉన్నతి కోసం అందరితో కలిసిపనిచేయ డానికి ముందుకు వస్తున్నారో, ఎవరు భిన్నత్వాన్ని అంగీకరించి, గౌరవిస్తున్నారో అలాంటి భారతీయు లంతా హిందువులే. వారి ఆరాధనా పద్ధతి, భాష, ఆహారపు అలవాట్లు, జన్మస్థలం మొదలైనవి ఏవైనా కావచ్చును. ఇవేవీ వారి భారతీయతకు అడ్డురావు.

హిందూ అనే పదాన్ని మతానికి మాత్రమే ముడిపెట్టడం అనే గందరగొళపు ఆలోచన, కల్పన బ్రిటిష్‌ వారి కాలం నుంచి మొదలైంది. ఈ పదాన్ని అంగీకరించని వర్గం సమాజంలో ఉంది. వాళ్ళు తమను తాము భారతీయులుగానే పిలుచుకుంటారు. కొందరు భారతీయత, సంస్కృతిపై ఆధారపడిన నాగరకతలను ఆంగ్ల పదం 'ఇండిక్‌' అని పిలు స్తారు. భయంవల్లగానీ, అవగాహన లేకపోవడం వలగానీ హిందూ శబ్దాన్ని అంగీకరించనివారు, వ్యతిరేకించేవారిని కూడా సంఘ సమాదరిస్తుంది. ఉపయోగించే పదాలు వేరుకావచ్చును, రీతిరివా జులు, ప్రాంతం, భాష, వేరుకావచ్చును. కానీ ఈ ప్రత్యేకతలు ఉన్న వారిని ఈ సమాజంలో భాగమేనని భావిస్తుంది. ఈ ఏకత్వభావనే ఈ జాతి మూల తత్వం, మౌలిక చింతన. అదే హిందూత్వం. ప్రాచీనమైన మన దేశపు ధార్మికమైన స్వభావాన్ని, సంస్కృతిని సంరక్షించి దేశ సర్వాంగీణ ఉన్నతి కోసం కృషి చేయాలనదే దీని లక్ష్యం.

అయితే ఈ కార్యాన్ని ఏదో కొందరు వ్యక్తులో, ఒక సంస్థకో వదిలిపెట్టి మనం మౌన ప్రేక్షకులుగా మారితే లాభం లేదు. దేశాభివృద్ధికి కృషి చేయడం, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, సంక్షోభాల నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావడం మొదలైనవి ఎవరో వచ్చి చేస్తారని భావించకూడదు. ఎవరో ఒకరు ముందుండి అవసరమైనంత వరకు నాయకత్వం వహిస్తారు. కానీ సంపూర్ణమైన, సర్వతో ముఖమైన, శాశ్వతమైన విజయం సాధించాలంటే మాత్రం స్పష్టమైన దృక్పధం, నిస్వార్ధమైన, నిజాయితీతో కూడిన కృషి, సుదృఢమైన ఏకత్వ భావన ఉండాలి. అలాంటి వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయాలి.