భారత్‌ మరో విజయం


అంతరిక్ష రంగంలో భారత్‌ మరో విజయం సాధించింది. అత్యాధునిక కార్టోశాట్‌ ఉపగ్రహాన్ని భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహ ప్రయోగంలో ఇస్రోకు అనేక విజయాలను అందిస్తున్న పీఎస్‌ఎల్‌వి రాకెట్‌ మన కార్టోశాట్‌ ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైంది.

ప్రయోగించిన 17 నిముషాల 38 సెకెన్‌ లకు కార్టోశాట్‌ 3 ఉపగ్రహం భూమికి 509 కి.మీ ఎత్తులో, భూమధ్య రేఖకు 97.5 డిగ్రీల వాలు కలిగిన నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించింది. 1,625 కేజీల బరువున్న కార్టోశాట్‌ 3 మూడవ తరానికి చెందిన అదునాతన ఉపగ్రహం. ఇది భూమికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను ఎప్పటి కప్పుడు పంపుతుంది. దీనిలో ఉన్న శక్తివంతమైన కెమెరా భూమిపై 0.25 మీటర్లు లేదా 25 సెంటీమీటర్ల పరిధిలోని ప్రదేశపు చిత్రాలను కూడా స్పష్టంగా తీయగలుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు ప్రయోగించిన భూపరిశీలన ఉపగ్రహా లన్నిటిలో కార్టోశాట్‌ 3 అత్యాధునికమైనది, అత్యంత శక్తివంతమైనది. భూమికి సంబంధించిన వివిధ రకాల చిత్రాలను కార్టోశాట్‌ తీయగలదు. దీనిని పూర్తిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించి, తయారుచేసింది.

కార్టోశాట్‌ ఉపగ్రహం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సరిహద్దు భద్రతకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఉగ్రవాదుల స్థావరాలను మరింత నిశితం గుర్తించి, పరిశీలించే అవకాశం కలుగుతుంది. సైనిక నిఘాను మరింత పటిష్టపరుస్తుంది. అలాగే నగరాల నిర్మాణప్రణాళి కను రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల నగర నిర్మాణం సరైన పద్ధతిలో సాగు తుంది. అలాగే తీరప్రాంతపు కచ్చితమైన వివరాలు కూడా లభిస్తాయి. తీరప్రాంతంలో భూమిని సక్రమంగా ఉపయోగించుకోగలుగుతాము. గ్రామీణ ప్రాంతాల్లో వనరుల అభివద్ధి, మౌలిక సదు పాయాల కల్పనకు మరింత వీలు ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వివరాల ద్వారా ఆయా ప్రదేశాల్లో ఎలాంటి పరిశ్రమలు అభివద్ధి చేయ వచ్చును, ఎలాంటి పంటలు పండించవచ్చన్నది తెలుసుకోవచ్చును. ఇదేకాక దేశం మొత్తానికి సంబంధించిన ఖనిజ, ఇతర వనరుల వివరాలు తెలుసుకోవచ్చును.

కార్టోశాట్‌ ఉపగ్రహంతోపాటు ఇస్రో మరో 13 ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన ఈ 13 నానో ఉపగ్రహాల ప్రయోగం ద్వారా ఇస్రో పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని కూడా సంపాదించింది. ఈ ఉపగ్రహాలన్నింటిని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వి రాకెట్‌కు ఇది 49వ ప్రయోగం. ఇప్పటివరకు ఏ ఒక్క ప్రయోగం విఫలం కాకపోవడం కొత్త రికార్డ్‌. ఈ రాకెట్‌ ద్వారా ఇస్రో ఇప్పటికే వందలాది ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించగలిగింది.