ధనుర్మాస విశిష్టత


దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం పవిత్రమైనది. సూర్యుడు ధనస్సురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేవరకు అంటే ''భోగి'' రోజు వరకు ధనుర్మాసం కొనసాగు తుంది. ఈ మాసం రోజుల్లో విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. గోదాదేవి ''మార్గళి'' వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి శ్రీ మహావిష్ణువును ఆరాధించింది. ధనుర్మాసం నెలరోజులు సాక్షాత్తు భూదేవి అవతారంగా భావించే ''ఆండాళ్‌'' రచించిన దివ్యప్రబంధం ''తిరుప్పావై'' (పవిత్ర వ్రతం) బ్రహ్మ ముహూర్తంలో పఠించినవారు ధైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి ''పాశురం'' పేరుతో ఒక కీర్తనతో రోజూ నారాయణుడిని ఆరాధించింది. ఈ మాసంలో మహిళలు ఇంటి ముందు గొబ్బమ్మలు పెట్టి అలంకరించి వాటిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ నెల రోజులు హరిదాసు సంకీర్తనలతో, జంగమదేవరలతో, గంగిరెద్దులను ఆడించేవారితో గ్రామాలలో సందడిగా ఉంటుంది. తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీ దళాలు బదులు బిల్వ పత్రాలు ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పరమ పవిత్రంగా భావిస్తారు.

ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ప్రవేశించిన రోజును ప్రముఖమైదిగా భావించి శివాలయాలలో పూజలు చేస్తారు. ఈ మాసంలో సూర్యనమస్కారాలు విశేషంగా చేస్తారు.