భగవద్గీత ప్రాముఖ్యత


ఒకసారి స్వామీ చిన్మయానందతో ఒక భక్తుడు 'స్వామీ నేను రోజూ భగవద్గీత పారాయణ చేస్తున్నాను. అయినా నా జీవితంలో ఏమార్పు రాలేదు ఎందుకని' అని అడిగాడు. అప్పుడు చిన్మయానంద వెంటనే 'భగవద్గీత గుండా నువ్వు వెళుతున్నావు. నీ గుండా భగవద్గీత వెళ్ళాలి' అంటూ సమాధానం చెప్పారు. కేవలం చదువుతూ పోవడంవల్ల చాలా కొద్ది ప్రయోజనమే ఉంటుంది. చదివినదాని గురించి ఆలోచించి, ఆచరణలోకి తేవడానికి ప్రయత్నించినప్పుడే మార్పు వస్తుందని వివరించారు.

డాక్టర్‌ బి.ఎం. గుప్తా విజ్ఞానశాస్త్రంలో మరింత పరిశోధన చేయడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ను కలిశారు. గుప్తాను చూసిన వెంటనే ఐన్‌స్టీన్‌ ఆంగ్లం, సంస్కృతభాషల్లో పలకరించారు. గుప్తాకి మాత్రం ఆంగ్లం తప్ప సంస్కృతం రాదు. ఆ విషయం గ్రహించిన ఐన్‌స్టీన్‌ అతన్ని తన గదిలోకి తీసుకు వెళ్ళి తన పుస్తకాలు చూపించారు. అందులో అనేక సంస్కృత గ్రంథాలతోపాటు భగవద్గీత కూడా ఉంది. 'విద్యలకు జన్మస్థలమైన భారత్‌ నుంచి వచ్చిన మీరు కనీసం సంస్కృతం నేర్చుకోవడంలో శ్రద్ధ పెట్టకపోవడం విచారకరం. విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు, కొత్త సిద్ధాంతాలను రూపొందించ డానికీ నాకు భగవద్గీత ఎంతగానో ఉపయోగ పడుతోంది' అన్నారు.