ఏపనీ తక్కువకాదు (స్ఫూర్తి)


భూదాన ఉద్యమాన్ని చేపట్టి కొన్ని లక్షల ఎకరాల భూమిని సేకరించిన వినోబా భావే దేశమంతా పర్యటించేవారు. ఒకసారి ఒక మారుమూల గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాఠశాల లోపల, చుట్టుపక్కల అశుభ్రంగా, మురికిగా ఉండడం గమనించారు. అదే విషయాన్ని విద్యార్థుల ముందు ప్రస్తావించారు. పాఠశాలను శుభ్రం చేసుకోవచ్చును కదా అని సూచించారు.

 అప్పుడొక విద్యార్థి పాఠశాల లోపలైతే తుడుచుకోవచ్చునుకానీ, మూత్రశాలల్ని ఎవరు శుభ్రం చేస్తారని ఎదురు ప్రశ్నించాడు. అందుకు వినోబా భావే 'మీరే శుభ్రం చేసుకోవాలి' అని సమాధానమిచ్చారు. వెంటనే ఆ విద్యార్థి 'మూత్రశాలలు శుభ్రంచేయడం పాకీవారి పని. మనమెందుకు చేయాలి' అన్నాడు. 'చిన్నప్పుడు నీ మలమూత్రాలను ఎవరు ఎత్తారు? నీ బట్టలు ఎవరు శుభ్రం చేశారు. ఆ పనులన్నీ మీ అమ్మ చేశారు. కాబట్టి అది తక్కువపని ఏమీకాదు. అలాంటి పని చేసినందుకు ఎవరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పైగా మన పరిసరాలను శుభ్రం చేసుకోవడం మన పని' అంటూ నచ్చచెప్పారు.