అదొక ఆదర్శ గ్రామం

ఒకప్పుడు అది వెనుకబడిన గ్రామం. అనేక సమస్యలతో సతమతమైంది. కానీ ప్రజల పట్టుదలతో ఇప్పుడు ఆ గ్రామం ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడింది. అక్కడ రైతులు అధునాతన నీటి పారుదల పద్దతులను ఉపయోగిస్తున్నారు. అక్కడ మురికి కాలువలు, అనారోగ్యకరమైన పరిస్థితులు కనిపించవు. ప్రతి ఇంటిలో మురుగునీటి గుంతలతో పాటు శౌచాలయాలు ఉన్నాయి. గ్రామంలో ఎక్కడ చూసిన మామిడి, జామ, వేప మొదలైన చెట్లతో పాటు తులసి వంటి ఔషధ మొక్కలు కనిపిస్తాయి. ఆ గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి సాధించినదిగా పేరుపడిన ఆ గ్రామం పేరు రవీంద్రనగర్‌. లక్ష్మీపూర్‌ ఖిరి జిల్లాలోని ఈ గ్రామం గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జన్మ శతాబ్దినాడు ఏర్పడింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టుకున్నారు.

దేశవిభజన సమయంలో జరిగిన దారుణమైన మారణకాండలో అదృష్టవశాత్తు బ్రతికిబయట పడగలిగిన కొద్దిమంది బెంగాలీలు ప్రాణాలు అరచేతపట్టుకుని ఈ ప్రాంతానికి వలసవచ్చారు. అలా వలసవచ్చిన వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఉండడానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. కలరా, అతిసారం వంటి వ్యాధులు చుట్టుముట్టాయి. గోమతి నది పక్కన ఏర్పాటుచేసిన శరణార్ధి శిబిరాలలో ఉండవలసి వచ్చింది. కొన్ని సంవత్సరాలపాటు కనీస సదుపాయాలు కూడా లేని దుర్భరమైన జీవితం గడపవలసి వచ్చింది. ముతక అడవి ధాన్యాన్నే ఉడకబెట్టుకుని తినవలసి వచ్చింది. కానీ 50 ఏళ్ల క్రితం అక్కడ ప్రారంభ మయిన సంఘ శాఖ ద్వారా ఎంతో మార్పు వచ్చింది. స్వయంసేవకుల సహాయంతో గ్రామస్తులు తమ భూమిని వ్యవసాయానికి తగినట్లుగా మార్చుకున్నారు. ఇందుకు ఎంతో శ్రమించారు.

ఒకప్పుడు రవీంద్ర నగర్‌ (పూర్వం దీనిని మియాపూర్‌ అని పిలిచేవారు) గ్రామంలో చేతబడి మొదలైన పద్ధతులు బాగా ప్రచారంలో ఉండేవి. అందుకని ఇతర గ్రామాలకు చెందినవారు ఇక్కడికి రావడానికే భయపడేవారు. కానీ 1969లో భైరవచంద్ర రాయ్‌ అనే స్వయంసేవక్‌ ఇక్కడ శాఖ ప్రారంభించారు. అప్పటి నుంచి క్రమంగా మార్పు ప్రారంభమైంది. మొదట స్వయంసేవకులే గ్రామంలో పాఠశాల ప్రారంభించారు. గ్రామంలో కొందరు ఆ పాఠశాలకు అవసరమైన స్థలం ఇచ్చారు. ఆ తరువాత ఆ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు కూడా పొందింది. గ్రామంలో చదువుకున్న యువకులు కొందరు స్వచ్ఛందంగా అందులో పిల్లలకు పాఠాలు చెపుతుంటారు. వారి కృషి మూలంగా గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించింది.

ఆ గ్రామస్తులు తమ ఇళ్లని ఇప్పటికీ ఆవుపేడతోనే అలుకుతారు. తెల్లవారుఝామున శంఖనాదంతో వారి దినచర్య మొదలవుతుంది. మహిళలు బీడీ పని చేసినా ఆ గ్రామంలో మాత్రం అందరూ ధూమపానానికి దూరంగానే ఉన్నారు. ఆ గ్రామంలో నాలుగు స్వయంసహాయక బృందాలు ఉన్నాయి. వీటి ద్వారా మహిళలకు కుట్టుపని, అద్దకం పని మొదలైనవి నేర్పుతారు.

రవీంద్ర నగర్‌ గ్రామం ఉత్తర్‌ప్రదేశ్‌ మొత్తంలోనే స్వచ్ఛతకు, శుభ్రతకు మారుపేరుగా నిలుస్తోంది. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయం, దేవాలయాలు, రహదారులు, ఆటస్థలాలు ఇలా అన్నీ ఎంతో శుభ్రంగా కనిపిస్తాయి. గ్రామంలోని యువత శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నారు. గ్రామస్తులే శ్రమదానం చేసి ఆటస్థలాన్ని చక్కని స్టేడియంగా మార్చుకున్నారు. గ్రామవికాస ప్రాంతప్రముఖ్‌ గా ఉన్న ప్రేమ్‌ శంకర్‌ అవస్తీ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో నిరుద్యోగులు, ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవారు లేరు. ఇక్కడ తయారయ్యే గాజు చిమ్నీలకు చాలా గిరాకీ ఉంది. విగ్రహాల తయారీ, మొదలైన అనేక పనులు చేసేవారు ఇక్కడ ఉన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ కు ప్రజా ఆరోగ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న డా. చిత్తరంజన్‌ విశ్వాస్‌ ఈ గ్రామానికి చెందినవారే.

పట్టుదల, కృషి ఉంటే ఎంతటి సమస్యల నుంచైనా బయటపడి ప్రగతి సాధించవచ్చని రవీంద్ర నగర్‌ గ్రామస్తులు నిరూపించారు.