సంస్కారమే సంక్రాంతి


సూర్యుడు మకరరాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అంటాం. క్రమంతప్పకుండా ప్రతి సంవత్సరం ఇదే సమయంలో జరుగుతుంది కాబట్టి సంక్రాంతి(సమమైన మార్పు) అనీ, మకర రాశికి సూర్యుని గమనం మారుతుందికాబట్టి మకర సంక్రాంతి అని వ్యవహరిస్తారు. మనకిది ఎంతో పెద్ద పండుగ.

ఇంటినిండా ధాన్యపురాశులు, భోగిమంటలు, అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, పండుగకు ఇంటికివచ్చే బంధువులు, పిండివంటలు, హరి దాసులు, భోగిపండ్లు, బొమ్మలకొలువులు, గంగి రెద్దులు, పశువుల పూజలు, అంతులేని ఆనందంతో కూడుకున్నదే సంక్రాంతి.

ఈ సంపద, ఆనందం అందరితో పంచు కుంటూ అనుభవించాలన్నది మన సంస్కృతి మనకు నేర్పింది. తరతరాలుగా ఈ సంస్కారాన్ని తరువాతి వారికి అందించడం బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా మన జీవనశైలి, పాటించే నియమాలు ఈ బాధ్యతతో ముడిపడి ఉన్నవే. మనం జరుపుకునే పండుగలన్నీ కూడా అందులో భాగమే.

భోగి, సంక్రాంతి, కనుమగా మూడురోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఎన్నో విశేషాలను మనకు చెపుతుంది. ఈరోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభం. ఇది బహుపుణ్యకాలం. వాతా వరణంలో మార్పు వస్తుంది. పగటి సమయం పెరగడంతో వేడి కూడా ఎక్కువవుతుంది.

భోగి నాడు పిడకలతో మంట వేస్తాము. ఇంట్లో పనికిరాని చెక్క వస్తువులను కూడా అందులో వేస్తారు. అనవసరమైన వస్తువులతో ఇల్లు చెత్తకుప్పగా మారకుండా చూసుకోవడం కూడా ముఖ్యమేకదా.

 ఆవుపేడ కలిపిన నీళ్ళతో కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను ఉంచి, పూలు, బియ్యం, దోసకాయలు, చిక్కుడుకాయల వంటి కొత్తపంటలతో నింపుతారు. ప్రకృతిలోని పశుపక్ష్యాదులకు తొలి నైవేద్యం అది. ముగ్గులు కూడా వివిధ విశేషాలను తెలిపే విధంగా ఉంటాయి. స్వర్గవాకిళ్ళు, రథంముగ్గు, గుమ్మడికాయ, గోవుపాదం మొదలైన శుభకరమైన ముగ్గులు ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సూచిస్తాయి.

గబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడపిల్లలు ఆడటం, పాడటం చేస్తారు. ఇది వారిని సంస్కృతికి, భాషకు దగ్గర చేస్తుంది. అందరూ కలిసి ఈ వినోదంలో పాల్గొనడంవల్ల బంధుభావం కూడా కలుగుతుంది. పండుగ కోసం కొత్త బియ్యంతో చేసే అరిసెలు, చక్కిలాలు వంటి పదార్థాలు, నువ్వులుతో చేసే తినుబండారాలు కాలానికి, వాతావరణానికి తగినట్లుగా మనకు ఆరోగ్యాన్ని చ్చేవే. పిల్లల, పెద్దల మానసిక వికాసానికి, సంస్కారానికీ, పోటీ ప్రవృత్తికి హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, పశువుల పూజ వంటివి దోహదం చేస్తాయి.

ఇంటికి బంధువులు రావడం, వారితోకలిసి పండుగ జరుపుకోవడంవల్ల మానవ సంబంధాలు మెరుగవుతాయి. మనకున్నది నలుగురితో పంచుకోవడం అలవాటవుతుంది. ఇంటి ముందుకు వచ్చే హరిదాసులకు, గంగిరెద్దులవారికి బియ్యం, బట్టలు, కానుకలు పిల్లలచేత ఇప్పించడంవల్ల వారిలో కూడా ఇతరులకు ఇవ్వటం అనే సంస్కారం లుగుతుంది.

భోగినాడు చిన్నపిల్లలకు రేగుపండ్లు, పూలు కలిపి భోగిపండ్లు పోస్తారు. అలా వారికి పెద్దల దీవెనలు అందుతాయి. బొమ్మలకొలువు ద్వారా పిల్లల్లో మన సంస్కృతిని గురించిన జ్ఞానం, పరిసర విజ్ఞానం, సృజనాత్మకత అలవడుతాయి. పేరంటం పేరుతో మహిళలు ఇతరుల ఇళ్ళకు వెళ్ళడంవల్ల ఆ ఊరు, ప్రదేశంలో ఉన్నవారిలో మనమంతా ఒకటనే భావం కలుగుతుంది.

పాడిపంటలతో ఇల్లు నిండిన సమయంలో పితృదేవతలకు తర్పణాలివ్వడం, అలా వారిని తలుచుకోవడం కూడా మన సంస్కృతి నేర్పే సంస్కారమే.  కనుమనాడు పశువుల పూజ కూడా ఎంతో ముఖ్యమైనది. మన జీవనంలో, సంపదలో వాటికి కూడా భాగం ఉందనే విషయాన్ని గుర్తించ డానికి, గుర్తుచేసుకోవడానికి ఇది ఉపయోగ పడుతుంది. పొంగలి చేసి పొలాల్లో చల్లడం ద్వారా క్రిమికీట కాదులకు కూడా ఆహారాన్ని అందిస్తాం.

పండుగను ఇంట్లో అందరూ చేసుకున్నా, ఆ పండుగలో ఉన్న పద్ధతిని, ఆచారవ్యవహారాలను తరతరాలుగా కాపాడుతున్నది మాత్రం మహిళలేనని చెప్పాలి. అందుకనే మహిళలే భారతీయ సంస్కృతి పరిరక్షకులని స్వామీ వివేకా నంద అన్నారు.