సకల విద్యాస్వరూపిణి సరస్వతీదేవి


(జనవరి 29 వసంత పంచమి సందర్భంగా)

సకల విద్యాస్వరూపిణి సరస్వతీదేవి జన్మదిన మైన వసంత పంచమిని విద్యారంభదినమని, వాగ్డేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మ వైవర్త పురాణం తెలియజేస్తుంది. వసంత ఋతువు రాకను సూచించే ఈ రోజును శ్రీపంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. శాంతమూర్తియైన సరస్వతీదేవి వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్యా, విజ్ఞాన, బుద్ధులకు ప్రతీక. సరస్వతీ దేవి కరుణతోటే విద్యాప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి.

విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానం, జ్ఞానం చేత ధనం, ధనం చేత అధికారం ప్రాప్తిస్తాయి. దొంగలు దోచుకోలేనిది, ఎంతమందికి పంచినా పెరిగేది విద్య మాత్రమే. మనిషికి మాటే ముఖ్యం కాబట్టి సరస్వతీదేవి ఆరాధన వలన సద్బుద్ది, మేధస్సు, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ కలుగుతాయి. తెల్లని పద్మం సరస్వతీదేవికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతాలైన వేదాలు వాగ్దేవిని ఆశ్రయించి ఉంటాయి.

గోదావరీ తీరాన ''బాసర'' క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతిని ఆరాధిస్తూ వేదవ్యాసుడు తపస్సు చేశాడు. అమ్మ సాక్షాత్కారం పొంది వేదవిభజన, అష్టాదశ పురాణాలను రచించాడు. అందుకే బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన వంతులు అవుతారని నమ్మకం.