పౌరసత్వ సవరణ చట్టం - వాస్తవాలు


పౌరసత్వ సవరణ చట్టం గురించి ఇప్పుడు సర్వత్ర చర్చ జరుగుతోంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్థాన్‌లలోని మైనారిటీలకు భారత పౌరసత్వం ఇచ్చే ఈ చట్టం ఎందుకు? ఏమిటి?

దేశవిభజనే మూలం

1947లో మనకు స్వాతంత్య్రం వచ్చిందికానీ దేశం ముక్కలైంది కూడా. తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌లు ఏర్పడ్డాయి. రాత్రికిరాత్రి లక్షలాది మంది హిందువులకు భారత్‌ పరాయి దేశమైపోయింది. తాముంటున్న దేశంలో వారు మైనారిటీలుగా మారారు. అనేకమంది భారత్‌కు తరలి వచ్చేశారు. కానీ కొంతమంది అక్కడే ఉండిపోయారు. అలాంటి వారందరికి రక్షణ కల్పించడమేకాక సుఖశాంతులతో కూడిన జీవనాన్ని కలిగించడం తమ బాధ్యత అంటూ గాంధీజీ, నెహ్రూ వంటి నాయకులు గట్టిగానే చెప్పారు.

నెహ్రూ - లియకత్‌ అలీ ఒప్పందం

తమ దేశాల్లోని మైనారిటీ వర్గానికి రక్షణ కల్పించాలని భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఒప్పందం జరిగింది. భారత ప్రప్రధమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ ప్రధాని లియాకత్‌ అలీలు 1950 ఏప్రిల్‌లో ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇలా ఒప్పందం కుదిరినా పాకిస్థాన్‌ మాత్రం దానికి విరుద్ధంగానే వ్యవహరించింది. తమ దగ్గర ఉన్న దళితులను భారత్‌కు వెళ్లకుండా అడ్డుకుంది. ''వాళ్లు వెళ్లిపోతే కరాచీలో వీధులు, మూత్రశాలలు ఎవరు శుభ్రం చేస్తారు?'' అని ప్రధాని లియాకత్‌ అలీ భారత హై కమిషనర్‌ ను ప్రశ్నించాడు.

మైనారిటీలపై మారణకాండ

ఇస్లామిక్‌ ఛాందసవాదం పెరగడం, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు ఇస్లామిక్‌ రిపబ్లిక్‌లుగా ప్రకటిం చడంతో ఆ రెండు దేశాల్లో మైనారిటీలపై దాడులు, అణచివేత పెరిగిపోయాయి. బలవంతపు మతమార్పిడులు, మైనర్‌ బాలికల అపహరణ, ప్రార్ధనామందిరాల విధ్వంసం, మత దూషణకు పాల్పడ్డారంటూ దాడి చేసి చంపివేయడం వంటివి నిత్యకత్యమయ్యాయి. ముస్లిమేతరుల జీవితాలు దుర్భరంగా మారాయి. వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1947లో పాకిస్థాన్‌ ఏర్పడేనాటికి అక్కడ హిందువుల సంఖ్య మొత్తం జనాభాలో 15శాతం.  కానీ 1998 వచ్చేనాటికి ఈ సంఖ్య 1.6 శాతానికి పడిపోయింది. 1951లో బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరుల జనాభా 22శాతం. అది 2011 నాటికి 9.5 శాతానికి తరిగిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఇదే పరిస్తితి. 1970నాటికి అక్కడ ముస్లిమేతరుల సంఖ్య 7.7లక్షలుంటే 2017నాటికి కేవలం 7వేల మంది మాత్రమే మిగిలారు. విపరీతమైన అణచివేతకు గురైన హిందువులు పెద్ద సంఖ్యలో భారత్‌ కు తరలివచ్చారు. అలా  పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్ధుల్లో ఎక్కువ శాతం దళితులే.

ఇంతకీ పౌరసత్వ సవరణ చట్టం (CAA) లో ఏముంది?

- 31 డిసెంబర్‌, 2014కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లలోని హిందూ, సిఖ్‌, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవ వర్గాలకి చెందిన వారెవరైనా భారత్‌ లో ప్రవేశించి ఉంటే వారిని ఈ చట్టం ప్రకారం అక్రమ చొరబాటుదారులుగా పరిగణించరు.

- పేర్కొన్న మూడు దేశాలకు చెందిన ఈ మైనారిటీ వర్గాలకు చెందినవారు కనీసం ఐదు సంవత్సరాలు(ఇది ఇంతకు ముందు 11 సంవత్సరాలుగా ఉండేది) భారత్‌లో ఉంటున్నట్లు చూపగలిగితే దేశీయకరణ ప్రక్రియ ప్రకారం వారికి ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది.

- ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇది కేవలం పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలోని మైనారిటీ వర్గానికి చెందినవారికి సంబంధించినది మాత్రమే. ఈ సవరణలకు ప్రస్తుతం భారత్‌ లో ఉంటున్న ముస్లిం లుగానీ, మరే పౌరులకుగాని ఎలాంటి సంబంధం లేదు.