భరతమాత జయంకోరి...


జనవరి 26వ తేదీన దేశమంతా అధికారి కంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. దీనివెనుక ఒక చరిత్ర ఉంది. 1929లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలలో ఒక సంవత్సరంలో ''సంపూర్ణ స్వరాజ్యం'' అని పిలుపునిచ్చారు. కాని 1930లో స్వరాజ్యం రాలేదు. కాని దేశమంతా తమ ఆకాంక్షను, దీక్షను వెల్లడి చేస్తూ 1930 జనవరి 26న సాతంత్య్ర దినోత్సవం జరిపారు నాటి స్వాతంత్య్ర సమరయోధులు. స్వతంత్రం ఆగస్టు 15న వచ్చింది.  మన రాజ్యాంగాన్ని అమలులోకి తేవడానికి నాటి దేశభక్తుల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జనవరి 26న మన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించు కున్నారు.

ఈ రోజున మనం భరతమాత పూజా దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. కారణం ఈ దేశంపట్ల మనకున్నది కేవలం ప్రభుత్వం- రాజ్యం - పౌరులు అనే సంబంధమే కాదు, ఈ దేశం మనకు తల్లి. ''మాతా పృధ్వీ పుత్రోహం పృధివ్యాః''-అనే భావనలోనే మన పరంపర అనేక యుగాలుగా కొనసా గుతూ వస్తున్నది. ఈ భూమి మనకు ''భరతమాత''. కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన నియమావళి పైననే ఆధారపడి నడిచే సమాజం, ఆ జాతి తాము జన్మించిన, నివసించే భూమిపట్ల భావాత్మకమైన అనుబంధం కలిగి ఉండదు. ఒక నియమానికి కట్టబడే జీవితాలుగానే ఆ సమాజం ఉంటుంది. కాని ఆ నియమాలను వాటి వెనుక ఉన్న యావత్తు సమాజాన్ని ప్రేమించి అందరూ ఒకటి అన్న భావనలో ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని తనదిగా మమేకమై జీవించడం, అదీ ఈ సమాజం కోసం. ఇది చిన్నచిన్న గణ రాజ్యాలుగా ఉన్నప్పటికీ, అనేక సంస్థానాలుగా ఏర్పడి ఉన్నప్పటికీ అవి కేవలం రాజకీయ పాలనాపరమైన విభజనలే కాని సంస్కృతి, సమాజం ఎన్నడూ సామాన్య ప్రజల నుండి పాలకుల వరకూ ఒక్కటిగానే గుర్తింపబడుతూ వచ్చింది. అది లోపించిన నాడు అంటే భరతమాత అందరికీ తల్లి అనే స్పృహ కోల్పోయిననాడు మన దేశం అన్యాక్రాంతమైంది. ఈ దేశంలో జన్మించి మొత్తం ప్రపంచానికీ దారి చూపించిన మహా పురుషులను మనం మరచిననాడు ఈ ప్రపంచ మంతా గౌరవించే మన సంస్కృతిపై దాడులు జరుగుతూ వచ్చాయి.

ఈ నాడు దేశంలో మళ్ళీ అదే స్థితి పునరావృత మౌతున్నది. దీనిని ఎదుర్కొని మళ్ళీ మన సంస్కృతీ వైభవాన్ని నిలబెట్టుకోవటమే 'భరతమాత పూజ'. మాత అంటే కన్న తల్లి మాత్రమే కాదు. అసంఖ్యాకు లైన వీరులను మహాపురుషులను కన్న భరతమాత. నేడేకాక వేలాది సంవత్సరాలుగా అటువంటి పుత్రులను కన్న తల్లి. ఇంకా అనేక వేల సంవత్స రాలు ఎందరికో జన్మనిచ్చి పోషించ బోయే తల్లి. నిత్య చైతన్య స్వరూపిణి. ఆమెను ఉపాసించడమే భరతమాత పూజ.