శక్తి స్వరూపుడు ఆదిత్యుడు


రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమినాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణా ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. 

బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడు. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరభాను’ అని తుసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైళు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
రామ రావణ యుద్ధం సమయంలో అసి పోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగులు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకుల రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌ - ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.