ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశవ్యాప్తంగా కరోనా సహాయ కార్యక్రమాలు


కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు సహకారం అందించడంతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌స్వయంసేవకులు దేశ వ్యాప్తంగా బాధితులకు అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రాంత కార్యవహ శ్రీ కాచం రమేశ్‌ ‌తెలియజేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ ‌మూలంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారికి తగిన సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్వయంసేవకులు పనిచేస్తున్నారని ఆయన తెలియజేశారు.
దేశవ్యాప్తంగా 26వేల స్థలాలలో 2లక్షల మంది స్వయంసేవకులు 25లక్షల కుటుంబాలకు సహాయం అందజేశారని వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 369 స్థలాల్లో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా 2678 మంది స్వయసేవకులు 25వేల కుటుంబాలను ఆదుకున్నారని ఆయన తెలియ జేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సేవావిభాగమైన సేవాభారతితో పాటు అనేక ఇతర సంస్థలతో కూడా కలిసి స్వయంసేవకులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు భోజన సదుపాయం కల్పించడం, ఉప్పు, నూనె, పప్పు, మొదలైన నిత్యవసర వస్తువులతో కూడిన కిరాణా కిట్‌ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు స్వయంసేవకులు చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్‌ ‌వ్యాపించకుండా తీసుకో వలసిన జాగ్రత్తలను కూడా ప్రజలకు తెలియ చెపుతున్నారు. రేషన్‌ ‌షాప్‌లు మొదలైన రద్దీ ప్రదేశాల్లో సామాజిక దూరాన్ని పాటించేవిధంగా చూడటం, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు సహకరించడం వంటివి కూడా స్వయంసేవకులు చేస్తున్నారని శ్రీ రమేశ్‌ అన్నారు.

భాగ్యనగర్‌లోని ఛార్మినార్‌, ‌నిజాంపేట్‌, ‌గచ్చిబోలి, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో అన్నదానం, వలస కార్మికులకు నిత్యవసర వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేశారు.  మహేశ్వరం, కొత్తగూడెం భదాద్రి, ఇందూర్‌ (‌నిజామాబాద్‌), ‌జగిత్యాల, జీడిమెట్ల, కామారెడ్డి, ఖమ్మం మొదలైన వివిధ ప్రాంతాల్లో కూడా స్వయంసేవకులు పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.