‌ప్రపంచానికి దారి చూపుతున్న భారత్‌

‌వ్యక్తిగానీ, జాతి లేదా దేశపు కష్టసహిష్ణుత, సమస్యలను ఎదుర్కొని, బయటపడే తీరు పెద్ద ఆపద, కష్టం, విపత్తు సంభవించినప్పుడు బయటపడతాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ అలాంటి పెద్ద ఆపద, కష్టమే. అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికాతో సహా మిగతా దేశాలన్నీ ఈ సమస్యను ఎదుర్కొవడం ఎలాగో తెలియక సతమతమవు తుంటే భారతదేశం మాత్రం ధైర్యంగా నిలబడింది. సమస్య తీవ్రత, దానివల్ల జరిగే నష్టాన్ని తగ్గించడంలో చాలామటుకు విజయం సాధించింది.

భారత్‌ అనుసరిస్తున్న విధానాన్ని తామూ అమలుచేయక తప్పదని అమెరికాతో సహా దేశాలన్నీ గ్రహించాయి. కేవలం 35కోట్ల జనాభా కలిగిన అమెరికాలో కోవిడ్‌19 ‌వల్ల చనిపోయినవారి సంఖ్య 80 వేలకు పైగా ఉంటే 130 కోట్ల భారీ జనాభా కలిగిన భారత్‌లో మృతుల సంఖ్య 5 వేలకు లోపునే ఉంది. సమస్య తీవ్రతను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టడంలో భారత్‌ ‌ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నింటికంటే ముందున్నదని చెప్పాలి. విదేశీయానాన్ని పూర్తిగా నిషేధించి, సకాలంలో మూసివేత (లాక్‌డౌన్‌) ‌ప్రకటించడం అత్యంత కీలకమైన చర్య అని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు నిపుణులంతా ప్రశంసిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలులో కూడా మిగిలిన ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇబ్బందులు తక్కువగానే ఉన్నాయి. తబ్లీగీ జమాత్‌ ‌కార్యక్రమం మూలంగా కొన్ని సమస్యలు ఎదురైనా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం మాత్రం ఏర్పడలేదు.
వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడంలో చెప్పుకోదగిన ఫలితాలు సాధించిన భారత్‌ ‌కోవిడ్‌19 ‌వ్యాధి చికిత్సలో కూడా ప్రపంచానికి కొన్ని పాఠాలు నేర్పింది. కోవిడ్‌19 ‌లక్షణాలను గుర్తించడానికి ఉపయోగించే టెస్ట్ ‌కిట్‌ను అతితక్కువ సమయంలో, చవకగా తయారుచేసిన ఘనత దక్కించుకుంది. వ్యాధి చికిత్సకు అవసరమైన హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ‌మందు కోసం నేడు అమెరికాతో సహా ప్రపంచం లోని 30కి పైగా దేశాలు భారత్‌ ‌ముంగిట చేతులుచాచి నిలుచున్నాయి. భారత్‌ అం‌దించిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాయి కూడా. సనాతనమైన జీవన విధానం, ఆచారవ్యవహారాలు తమకంటే భారత్‌ను ఎంతో ముందుంచుతాయని మిగిలిన ప్రపంచ దేశాలు మరోసారి గుర్తిస్తు న్నాయి. అందుకనే భారత్‌ ‌మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్నాయి. సార్క్, ‌జి5 సభ్యదేశాలు భారత్‌ ‌సలహాను అనుసరించి చర్యలు తీసుకుంటు న్నాయి. ఇది భారత విజయమే.