మహారోగం మాయమయ్యేదెలా?


ప్రపంచమంతా చైనా కరోనా వైరస్‌తో అతలా కుతలమవుతున్నది. చైనాలో ఊహన్‌ ‌మార్కెట్‌తో మొదలైన ఈ వైరస్‌ 100 ‌దేశాలను కమ్మేసింది. 112 రకాల జంతువుల్ని పచ్చిగానైనా, ఉడికించైనా, వేయించైనా చైనీయులు తినేస్తారక్కడ. ఇవాళ కరోనా వైరస్‌కు కారణం మనం ఓ విస్తృత ప్రయోజనం, ఓ విశ్వ సర్వజీవన సంతుష్ఠి కోసం మనుగడ సాగించకపోవడం, మనం ఇతర జీవజాలం, ఇతరులతో విడిపోయి జీవించడం. జీవజాతులకు అంతులేదు. 
జీవవైవిధ్య పరిరక్షణే ప్రకృతిలో మనం వేసుకున్న బంధం. ఇది పరస్పర పూరకమైనది. అందుకే ప్రాణికోటి ఆరాధనా మంత్రాన్ని భారత్‌  ‌బోధించింది. ‘‘సర్వే భవస్తు సుఖినః సర్వే నస్తు నిరామయాః సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చిత్‌ ‌దుఃఖభాగ్భవేత్‌ ఓం ‌శాంతిఃతి శాంతిః శాంతిః’’
మనదేశంలో కరోనా వైరస్‌ ‌పుణ్యమాని అనేక విషయాలు మనకు గుర్తుకు వచ్చాయి. ఎంగిలి, తుంపరాలు, నోళ్ళు మారకూడదనగానే మెడికల్‌ ‌షాపుల్లో మాస్కులు మాయమయ్యాయి. ఋషు లేనాడో ఒకరి ఎంగిలి ఒకరు తినకూడదన్నారు. శుచి, శుభ్రత పాటించమన్నారు. భారతీయ సంస్కృతిలోని విశేషత నేడు కరోనా ప్రపంచానికి తెలిసి వచ్చింది. రెండు చేతులు జోడించి నమస్తే పెట్టడం, బయటి నుంచి వచ్చినపుడు కాళ్ళుకడుక్కుని ఇంట్లోకి రావడం, జీవజంతుజాలం పట్ల కారుణ్యం కలిగివుండడం, శుద్ధ సాత్వికాహారం భుజించడం, ఉన్నతంగా ఆలోచించడం ఇలా ఎన్నో ఉన్నాయి.
బృహత్తర భారతంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అన్నిటిలోనూ విజ్ఞాన శాస్త్రం నిబిడీకృత మైవుంది. ఇంటిముందు కళ్ళాపి, ముగ్గు వేయడం, మామిడి తోరణాలు కట్టడం, పుసుపు గుమ్మాలు, అభ్యంగన స్నానం, నిత్యధ్యానం, అవు నెయ్యతో దీపం, నియమితాహారం, అందులోనూ ఉడికించిన కూరలు (వేపుళ్ళు కాకుండా), తైలసంస్కారం, ఆయుర్వేదం, గృహవైదం, నిత్య యోగ, నిండైన నుదుటి కుంకుమ బొట్టు, ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. అన్నిటిలో ఓ శుచి, శుభ్రత, ఓ నమ్రత, ఓ క్రమ శిక్షణ మనకు గోచరస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినంత మాత్రం పాతమీద రోత పెంచుకోవడం సరికాదు.  అన్నిటిలో ఓ సంతులనం, ఓ సమదృష్టి, ఓ సంకరం లేని క్రాంతి కనబడతాయి. వేల సంవత్సరాల జాతీయ జీవనంలో ఎన్నిసార్లు పుష్కరాలు, కుంభమేళాలు జరిగి కోట్లాది మంది స్నానాలు చేసినా ఏనాడు రోగం కనబడని దేశం మనది. ఈ రోజు బయటి నుంచి విమానం దిగుతున్నవాళ్ల వల్లే కరోనా మరణాలు సంభవిస్తు న్నాయి. ఇన్ని కోట్ల మంది ఎన్నో రకాల వైవిధ్యమున్న ప్పటికీ దేశం మహమ్మరి రోగాల బారినపడలేదు. కాని మనదైన జీవన విధానం పక్కన బెట్టి బ్రతకడం మొదలెట్టిన తరువాతనే మనిషి రోగాల బాట పట్టాడు. బయటి తిళ్ళు మరిగిన తరువాతనే రోగగ్రస్త జీవితం మొదలయింది. బహుళ జాతి సంస్థల దుకాణాల్లో దొరికే ఆహారంలో, శీతల పానియాల్లో రసాయనాల శాతం పెరిగి అది కాన్సరు వంటి రోగాలకు కారణభూత మవుతున్నది. చైనా ఊహన్‌ ‌మార్కెట్‌లో జంతువు లను తినడం జంతువులకుండే వైరస్‌లు అంటువ్యాదులాగా మారే అవకాశం కల్పించింది.
 వేదన వ్యక్తిగతం. సంవేదన సమాజ హితం. మనం బావుంటే చాలానుకునే పరిస్థితి కాదిది. అందరూ బావుండాలని ఆలోచించాల్సిన క్షణమిది. మానవ జన్మ దుర్లభమైనది. అందునా హిందువుగా పుట్టటం, హిందు భూమిలో పుట్టడం పూర్వజన్మ సుకృతం. జీవాత్మ పరమాత్మలో లీనం కావడమే జీవన్ముక్తికి సోపానం. దీన్నే యోగమని అన్నారు.
తరువతరువబుట్ట తరువున అనలంబు,
తరువతరువబుట్ట దధిని ఘృతము,
తరువతరువబుట్ట తనువున తత్త్వము,
విశ్వదాభిరామ వినురమేమ!
 మనం కూడా సమాజ సాధకుడిగా జీవితం సాగించాలంటే అంతర్ముఖులం కావాలి. మనిషి సమాజ జీవి. సంఘటన, అంటే కలిసి ఉండడం, సమాజపు సహజ లక్షణం. ఈ విషయాన్ని గుర్తించి అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆలోచించి, వ్యవహరించాలి. అప్పుడే అందరి ప్రయోజనం నెరవేరుతుంది. ఈ చైనా కరోనా కల్లోలం మనకేకాదు, ప్రపంచానికి నేర్పిన పాఠం ఇదే.
- హనుమత్‌‌ప్రసాద్‌