ఆమె కృషి అభినందనీయం


ఇప్పుడు ప్రపంచమంతటా వినిపిస్తున్న మహమ్మారి పేరు కరోనా... ఇప్పుడిప్పుడే మనదేశం లోనూ ఇది విజృంభిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరమే ఈసమస్యకి పరిష్కారమార్గం. మన చుట్టుపక్కల ఎవరైనా సరే దగ్గినా, తుమ్మినా కాస్త నీరసంగా కనిపిస్తున్నా అనుమానించే రోజులు వచ్చేసాయి. కరోనా లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్ధారించు కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. విదేశాల నుంచి తెచ్చిన కరోనా టెస్టింగ్‌ ‌కిట్స్ ఆరేడు గంటల్లో ఫలితం తేల్చినా అవి సరిపోవడం లేదు. ఈసమస్యకు చెక్‌ ‌పెట్టింది పూణేకి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ ‌మినాల్‌ ‌దఖావే భోస్లే.

ఈమె మైల్యాబ్‌ అనే ఫార్మా కంపెనీలో పరిశోధన అభివృద్ధి విభాగంపు హెడ్‌గా పనిచేస్తోంది. దేశంలోనే తొలి కరోనా టెస్ట్ ‌కిట్‌ను రూపొందించింది. తన టీంతో కలిసి ఆరంటే ఆరు వారాల్లోనే కరోనాను నిర్ధారించే టెస్ట్ ‌కిట్‌ ‌రూపొందించింది. దీనికి ‘పాతో డిటెక్ట్’ అని నామకరణం చేశారు.

కేవలం రెండు గంటల్లోనే
ఇప్పుడు మనం వాడుతున్న కిట్లు కరోనా ఫలితాన్ని తెలుపడానికి కనీసం ఆరేడు గంటలైనా  తీసుకుంటాయి. కానీ మినాల్‌ ‌రూపొందించిన ఈ కిట్‌ ‌కేవలం రెండున్నర గంటల్లోనే కరోనా ఉన్నదీ లేనిదీ అనే ఫలితాన్ని తెలుపుతుంది. ‘ఈ విజయం వెనుక నాతో పాటు 10 మంది నా సహోద్యోగుల శ్రమ కూడా దాగుంది’.. అంటోంది మినాల్‌.

‌గర్భిణిగా ఉండి కూడా
ఇప్పుడున్న పరిస్థితుల్లో మనదేశానికి కరోనా టెస్ట్ ‌కిట్‌ అత్యవసరం అని ఆమె భావించింది. అందుకే దాన్ని తయారు చేయాలని సంకల్పించు కునేనాటికి మినాల్‌ ‌నిండు గర్భిణి. అయితే ఫిబ్రవరిలో ఆమెకు కొన్ని గర్భస్థ సమస్యలు రావడంతో ఆసుపత్రిలో చేరింది. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కొన్ని రోజులకే టెస్ట్ ‌కిట్‌ ‌తయారీపై దృష్టి సారించిందామె.

 తన బృందంతో కలిసి ఆరు వారాల్లోనే కరోనా నిర్ధారణ కిట్‌ ‌తయారు చేసి.. ఈ మార్చి 18న ఇవాల్యుయేషన్‌ ‌కోసం ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌వైరాలజీ’కి సమర్పించింది మినాల్‌. అది కూడా రేపు డెలివరీ అనగా ముందురోజు కిట్‌ ‌వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కి సమర్పించడం విశేషం. ఆ మరుసటి రోజే (మార్చి19) ఈ సూపర్‌ ‌వుమన్‌ ఓ ‌పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక ‘నేషనల్‌ ‌వైరాలజీ ఇనిస్టిట్యూట్‌’ ‌కూడా ఈ కిట్‌కి ఆమోద ముద్ర వేసింది. ఈ కరోనా కిట్‌ ‌తమ ప్రమాణాలను వంద శాతం అందుకుందంటూ గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది.

దీంతో వారంలో దాదాపు 1లక్ష కిట్‌లు రూపొందించగలమని, మరీ అవసరమైతే రెండు లక్షల కిట్‌లు కూడా ఉత్పత్త్తి చేయగలమంటూ మైల్యాబ్స్ ‌సంస్థ పేర్కొంది. ఒక కిట్‌ ‌వంద శాంపిళ్లను పరీక్షించగలదని తెలిపిందీ సంస్థ. కాగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కిట్స్ ‌ధర ఒక్కోటి రూ.4500లు ఉండగా, మైల్యాబ్స్ ‌తయారు చేసిన కిట్‌ ‌ధర రూ.1200లు మాత్రమే. ఇలా తక్కువ ధరకే, తక్కువ సమయంలోనే కరోనా పరీక్ష చేసి ఫలితాన్ని వెల్లడించే పాతో డిటెక్ట్ ‌తయారు చేయడంలో మినాల్‌ ‌చేసిన కృషి నిజంగా అభినందనీయం. ఆమె మరెందరికో ఆదర్శం కూడా!
- లతాకమలం