జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మొత్తానికి భారత రాజ్యాంగాన్నివర్తింపచేయడం, రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం రెండూ ప్రశంసనీయమైన చర్యలు


రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌, అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం - యుగాబ్ది 5121, బెంగళూరు, 14 మార్చ్, 2020
‌తీర్మానం - 1
జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రం మొత్తానికి భారత రాజ్యాంగాన్ని వర్తింపచేయడం, గౌరవనీయ రాష్ట్రపతి ఇచ్చిన రాజ్యాంగపరమైన ఆదేశాన్ని పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదంతో 370వ అధికరణను నిర్వీర్యం చేయడం వంటి చర్యలను అఖిల భారతీయ కార్యకారీ మండలి హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నది. 
అలాగే రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్‌, ‌లడఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం కూడా ప్రశంసించదగిన చర్య. ఇలాంటి చారిత్రాత్మక, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించడంలో చూపిన పరిణతికి, చొరవకు  కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు కార్యకారీ మండలి అభినందనలు తెలుపుతోంది. గౌరవనీయ ప్రధానమంత్రి, ఆయన బృందం చూపిన రాజకీయ చిత్తశుద్ది, రాజనీతిజ్ఞతలు కూడా ప్రశంసనీయమైనవి.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు, ప్రాంతాలకు భారత రాజ్యాంగం సమానంగా వర్తిస్తున్ననప్పటికీ, దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ ‌చేసిన దాడి వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో తాత్కాలికమైన 370వ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తరువాతి కాలంలో 370వ అధికరణ పేరు చెప్పి రాజ్యాంగంలోని అనేక అధికారణాలను జమ్మూ కశ్మీర్‌ ‌రాష్ట్రంలో అమలు చేయకపోవడం గాని, పూర్తిగా మార్చివేసి అమలుపరచడంగాని జరిగింది. వేర్పాటువాద బీజాలను నాటిన 35ఏ వంటి పరిచ్ఛేదాలను ఏకపక్షంగా రాష్ట్రపతి ఆదేశాల ద్వారా రాజ్యాంగంలో చొప్పించారు. ఈ రాజ్యాంగ పరమైన వైపరీత్యాల మూలంగా రాష్ట్రంలోని షెడ్యూల్‌ ‌కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, గూర్ఖాలు, మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు, పాకిస్థాన్‌ ‌శరణార్ధులు మొదలైనవారు తీవ్ర వివక్షకు గురయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో జమ్ము, లడఖ్‌ ‌ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు, నిర్ణయ పక్రియలో సరైన భాగస్వామ్యత లేకుండా పోయాయి. ఇలాంటి లోపభూయిష్టమైన విధానాల మూలంగా రాష్ట్రంలో ‘తీవ్రవాదం, ఛాందసవాదం’ పెరిగిపోవడం చూశాం. అలాగే జాతీయ శక్తులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి.
ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు మూలంగా ఈ రాజ్యాంగపరమైన, రాజకీయ పరమైన వైపరీత్యాలకు విరుగుడు జరుగుతుందని కార్యకారీ మండలి విశ్వసిస్తోంది. అలాగే ఈ చర్యలు ‘ఒకే దేశం - ఒకే ప్రజానీకం’ అనే భావనకు తగినట్లుగా ఉండడమేకాక రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ‘మనం ఈ దేశ ప్రజానీకం’ అనే ఆలోచనను కూడా పరిపుష్టం చేసే విధంగా ఉన్నాయి.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వలన మూడు ప్రాంతాల్లోని అన్ని వర్గాలవారి సామాజిక, ఆర్ధికాభివ ృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయని కార్యకారీ మండలి భావిస్తున్నది. పునర్వ్యవస్థీకరణ లడఖ్‌ ‌ప్రాంత ప్రజానీకపు చిరకాల ఆకాంక్షలను నెరవేర్చేవిధంగా, ఆ ప్రాంతపు సమైక్యాభివృద్ధికి అనుకూలంగా ఉంది. శరణార్ధుల సమస్యలు కూడా పరిష్కారమవుతాయని కార్యకారీ మండలి ఆశిస్తోంది. కశ్మీర్‌ ‌లోయ నుంచి గెంటివేతకు గురైన హిందువుల గౌరవపూర్వకమైన పునరావాస పక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలి.

‘విలీన ఒప్పందం’పై సంతకం చేయడం ద్వారా మహారాజా హరిసింగ్‌ ‌జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేశారన్నది చారిత్రక సత్యం. జాతీయ సమైక్యత, జాతీయ జెండా గౌరవం కోసం డా. శ్యామా ప్రసాద్‌ ‌ముఖర్జీ, పండిట్‌ ‌ప్రేమ్‌ ‌నాథ్‌ ‌డోగ్రాల నాయకత్వంలో ప్రజా పరిషద్‌ ఆం‌దోళన్‌కు చెందిన సత్యాగ్రహులు ఆందోళన చేశారు.  మిగిలిన దేశంలోని జాతీయవాదులు 370వ అధికరణ దుర్వినియోగం మూలంగా కలిగిన సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. గత 70 ఏళ్లుగా జమ్మూకాశ్మీర్‌లోని జాతీయవాదులు దేశంలోని ఇతర జాతీయవాదులతో కలిసి వేర్పాటువాదం, తీవ్రవాదాలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రాణాలను సైతం అర్పించారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడటంలో వేలాది మంది సైనికులు, భద్రతాదళాలవారు అపూర్వమైన ధైర్యసాహసాలను చూపారు. మహోన్నత త్యాగాలు చేశారు. వారందరికి కార్యకారీ మండలి కృతజ్ఞతాపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ విశిష్టతను పాదుకొలిపేందుకు దేశ ప్రజానీకమంతా, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఏకంకావాలని, జమ్మూకాశ్మీర్‌, ‌లడఖ్‌ ‌ప్రాంతాల అభివృద్ది యాత్రలో భాగస్వాములు కావడం ద్వారా దేశ సమైక్యత, సమగ్రతలను మరింత పటిష్టపరచాలని కార్యకారీ మండలి పిలుపునిస్తున్నది. అలాగే ఈ ప్రాంత ప్రజానీకపు సందేహాలు, భయాలను తొలగించి, సమర్ధమైన, న్యాయపూర్వకమైన పరిపాలన, ఆర్ధికాభివృద్ధి ద్వారా వారి ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది.