విశాఖ విషవాయువు బాధితులకు అండగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌స్వయంసేవకులు

విశాఖపట్నంలోని వెంకటాపురం ఎల్‌. ‌జి పాలిమర్స్ ‌కర్మాగారం నుండి రసాయన వాయువు వెలువడిన ఘటన ఈ నెల 7న జరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోయారు. 400మందికి పైగా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యారు. అనేక పశువులు, ఇతర జంతువులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయాయి.

ఈ దుర్ఘటన జరిగిన తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలు వెంటనే రంగం లోకి దిగి క్షతగాత్రుల తరలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గుడిలోవా ప్రాంతానికి చెందిన విజ్ఞాన విహార విద్యాలయాలకు చెందిన వివేకానంద హాస్పిటల్‌ అం‌బులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో సేవలు అందించారు.
ఘటన కారణంగా స్థానిక వెంకటాపురం, ఆర్‌.ఆర్‌ ‌వెంకటాపురం తదితర గ్రామాల ప్రజలు తమ ఇళ్ళను వదిలి సింహాచలం, అడవివరం తదితర గ్రామాలకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకొన్నారు.
చెట్ల క్రింద, సింహాచలం దేవస్థానం సత్రాలలో తలదాచుకొన్నారు. వీరికి మాధవధార, సీతమ్మ ధార, ద్వారకానగరం తదితర ప్రాంతాలలోని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలు సేవలందించారు. ప్రజలకు భోజన సదుపాయం తదతర ఏర్పాట్లు చేశారు. శ్రీ లలితా పీఠం ట్రస్ట్ ‌బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసింది. మొత్తం 5000 ఆహార పొట్లాలతో పాటు మంచి నీరు, మజ్జిగ పొట్లాలు ఈ సందర్భంగా బాధితులకు అందజేశారు.
రసాయన వాయువు పీల్చడంతో ప్రహ్లాదపురం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కళ్ళు మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతున్న ప్రమాదాన్ని పసిగట్టి అక్కడ ఉండే ప్రజలకు ఉచిత ముగా హోమియో మాత్రలను పంచారు.