వారి కృషి అభినందనీయం

కరోనా వైరస్‌ ‌నుంచి రక్షించుకోవాలంటే మాస్కులు ధరించడం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత అనేవి మాత్రమే మార్గం. ఇలాంటి సమయంలో మాస్క్‌లు మార్కెట్లో విరివిగా దొరకట్లేదు. సానిటీజర్లు కూడా అంతంత మాత్రంగానే లభ్యమవుతున్నాయి. ఈ సవాళ్ళని అధిగమించడానికి ఇటు ఇంటిపనులని అటు సామాజిక బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కొందరు మహిళలు. వాళ్ల గురించి మనం కూడా తెలుసుకుందాం.

శానిటీజర్స్ ‌తయారీలో
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ‌జిల్లాలోని మహిళా సంఘాల గ్రూపులకు చెందిన మిగతా మహిళలంతా శానిటైజర్ల తయారీలో తీరికలేకుండ గడుపు తున్నారు. ఈ క్రమంలోనే శానిటైజర్‌ ‌తయారీ, ప్యాకింగ్‌ ‌కోసం అక్కడి రాయరూ ప్రాంతంలోని మద్యం కర్మాగారాన్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో శానిటైజర్‌ ‌తయారీ పనుల్లో మరింత వేగం పుంజుకుంది. అంతేకాదు.. ఈ శానిటైజర్ల తయీరీ కోసం ‘రాయరూ డిస్టిల్లరీ డిఫెన్స్ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్మెంట్‌ ఎస్టాబ్లిష్మెంట్‌ ‌సంస్థ దాదాపు 20 వేల లీటర్ల స్పిరిట్‌ ‌కూడా అందజేస్తోంది.
ఇలా ప్రభుత్వం చొరవతో, మహిళా సంఘాలంతా ఏకమై తయారు చేస్తోన్న మాస్కులు, శానిటైజర్ల ధర కూడా చాలా తక్కువ. ఈ క్రమంలో ఒక్కో మాస్కుకు రూ.10 చొప్పున, లీటర్‌ ‌శానిటైజర్‌ ‌బాటిల్‌ ‌కు రూ.100 చొప్పున ధర నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వీటి తయారీ పూర్తయ్యాక ఆర్డర్లు సప్లై చేయడంతో పాటు అక్కడ కొన్ని సెంటర్లను ఏర్పాటు చేసి వీటిని విక్రయిస్తున్నారు.
మాస్క్‌ల తయారీలో
అంతే కాకుండా మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ ‌కింద గ్వాలియర్‌ ‌జిల్లాలో 2,375 మహిళా సంఘాల గ్రూపులున్నాయి. వీరిలో 862 మంది మహిళలు మాస్కుల కుట్టుపనిలో నిమగ్నమయ్యారు. అయితే అంతకంటే ముందు ఆ జిల్లా పంచాయతీ సీఈఓ శివం వర్మ ఆదేశాల మేరకు అక్కడి 8 గ్రూపుల్లోని 46 మంది మహిళలు 900కు పైగా మాస్కుల్ని తయారు చేశారు. పర్యావరణహితమైన కాటన్‌, ‌నాన్‌ ‌వువెన్‌ ‌ఫాబ్రిక్‌ ‌వంటి ఉత్పత్తులతో తయారుచేసిన ఈ మాస్కుల్ని ప్రత్యేక పద్ధతుల్లో శుభ్రపరచి చీఫ్‌ ‌మెడికల్‌ ‌హెల్త్ ఆఫీసర్‌ ‌కార్యాలయాలకు, ఇతర ఆరోగ్య సంస్థలకు అందజేశారు. దాంతో మరో రెండు లక్షల మాస్కులు కావాలంటూ ప్రభుత్వం, ఇతర ఆరోగ్య సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇలా వీటికి డిమాండ్‌ ‌పెరగడంతో మరిన్ని గ్రూపుల్లోని మహిళలు ఈ పనిలో నిమగ్న మయ్యారు. ఇలా మొత్తంగా 862 మంది మహిళలు పర్యావరణహిత మాస్కుల తయారీలో బిజీగా ఉన్నారు.
కేవలం వీరు మాత్రమే కాకుండా దేశంలో చాలా మంది గ్రామీణ మహిళలు తమ తమ సహాయాన్ని అనేక విధాలుగా ఈ కష్టకాలంలో అందిస్తున్నారు. వారందరి కృషి అభినందనీయం.
- లతాకమలం