స్వావలంబనే భవ్యభారతానికి ఆధారం -డా. మోహన్‌ ‌భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌


‘130 ‌కోట్ల మంది భారతీయులందరూ మనవారేననే స్నేహ, ప్రేమ, గౌరవపూర్వక భావంతో కరోన బాధితులకు సేవ చేద్దాం. భయం, క్రోధం వంటి అవలక్షణాలకు లోనుకాకుండా అందరితో కలిసి, అందరి కోసం పనిచేయడమే నేటి ఆవశ్యకత’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘ చాలక్‌ ‌డా. మోహన్‌ ‌భాగవత్‌ అన్నారు. కరోన మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు, వాటి నుంచి మనం నేర్చుకున్న పాఠాలను మరచిపోకుండా స్వావలంబన, స్వదేశీ విధానాన్ని అవలంబించి నూతన భారతాన్ని నిర్మించుకోవాలని ఆయన దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అటువంటి భారతదేశం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన ఆన్‌లైన్‌  ‌ప్రసార మాధ్యమాల ద్వారా ఏప్రిల్‌ 26‌న ప్రసంగించారు.

కరోన వైరస్‌ ‌వ్యాప్తి మూలంగా సంఘ నిత్య కార్యక్రమాలు జరగకపోయినా స్వయంసేవకులు పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కీర్తిప్రతిష్టలు ఆశించకుండా, ఎలాంటి స్వార్ధం లేకుండా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ఈ సేవాకార్యక్రమాల ఉద్దేశ్యం. అలాగే అలసి పోకుండా, నిరంతరంగా సేవ చేయడానికి స్వయంసేవకులు సంసిద్ధులై ఉంటారు. తన పర భేదం లేకుండా బాధితులందరిని ఆదుకోవడం భారతీయుల తత్వమని, అందుకే మన దేశం ఎగుమతి ఆంక్షలను పక్కన పెట్టి అన్నీ దేశాలకు అత్యవసర మందులు పంపిందని డా. మోహన్‌ ‌భాగవత్‌ అన్నారు.
ఆలస్యం చేయకుండా, తగిన సమయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టడం వల్లనే కరోనా వ్యాప్తిని సమర్ధంగా అరికట్టగలిగామని, ప్రజలు కూడా సకారాత్మక దృష్టితో, క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని ఆయన అన్నారు. నకారాత్మక దృక్పధం, కొందరికి కీడు చేయాలనే ఆలోచన వల్లనే ఈ వైరస్‌ ‌వ్యాప్తి జరిగిందని, ఇటువంటి ఆలోచనకు అందరూ దూరంగా ఉండాలని అన్నారు. ‘భారత్‌ ‌తెరే తుక్దే హోంగే’ అంటూ స్వార్ధప్రయోజనాలకోసం కలతలు రేపేవారు, సమాజంలో భయాన్ని, క్రోధాన్ని పెంచేవాళ్లు ఎప్పుడు ఉంటారని వారి వల్ల ప్రభావితం కాకుండా మనం మన పని చేసుకు పోవాలని ఉద్బోధించారు. మహారాష్ట్రలో సమాజహితం కోసం జీవించే ఇద్దరు సాధువుల హత్యను అంతా ఖండించవలసిందేనని, అయితే ఇలాంటి సంఘటనలు మనలో భయాన్నిగాని, క్రోధాన్నిగాని కలిగించకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ రెండు స్థితుల్లోనూ మనం సంతులనం కోల్పోయి తప్పులు చేసే అవకాశం ఎక్కువని, అలా మన చేత తప్పులు చేయించి వాటిని తమ స్వార్ధం కోసం వాడుకోవాలనుకునే శక్తులు చాలా ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు మనకు అనేక పాఠాలు కూడా నేర్పాయని, వాటిని గుర్తుపెట్టుకుని మన జీవన విధానాన్ని తీర్చి దిద్దుకోవాలని డా. మోహన్‌ ‌భాగవత్‌ ‌సూచించారు. స్వావలంబన, స్వదేశీ విధానాలు మనకు అత్యవసరమని ఈ కష్టకాలం మనకు చెప్పిందని, కనుక నీరు, గాలి, మట్టిని పరిశుభ్రంగా ఉంచు కోవడం, గో ఆధారిత వ్యవసాయాన్ని పెంపొందిం చడం, ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని పూర్తిగా మానుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలని అన్నారు. దేశభక్తి అంటే ఇదేనని సోదరి నివేదిత వంటివారు చెప్పారని నాగరికమైన క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవరచుకుని మనం భావ్యమైన భారతాన్ని నిర్మించుకోవాలని డా. మోహన్‌ ‌భాగవత్‌ ‌తన ప్రసంగాన్ని ముగించారు.