సికార్‌లో వెల్లివిరిసిన సంస్కారం

 
రాజస్థాన్‌ ‌సికార్‌ ‌జిల్లాలోని రెండు పాఠశాలల్లో 54మంది వలస కూలీలను ఉంచారు. కరోనా వైరస్‌ ‌వ్యాపించకుండా వారిని ఇక్కడ ఉంచారు. వీరంతా హరియాణ, రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌లకు చెందినవారు. పల్సానా పట్టణంలోని రెండు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ ‌కేంద్రాల్లో వీరిని ఉంచారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామస్తులు అన్ని సదుపాయాలు కలిగించారు. వేళకి భోజనం, అవసరమైన మందులు అందించిన గ్రామస్తుల పెద్దమనసుకు ఈ వలస కార్మికులు ముగ్ధులయ్యారు. 
అడగకుండానే ఇన్ని సదుపాయాలు కలిగించిన గ్రామానికి తమకు తోచినది చేయాలనిపించింది. వెంటనే తమకు వచ్చిన, తాము చేసే పెయింటింగ్‌ ‌పని గ్రామస్తులకు ఉపయోగపడుతుందని వారికి అనిపించింది. తమకు వసతి ఏర్పాటు చేసిన రెండు పాఠశాల భవనాలకు రంగులు వేయాలనుకున్నారు. గ్రామ సర్పంచ్‌ ‌రూప్‌ ‌సింగ్‌ ‌షెకావత్‌ ‌కు తమ ఆలోచన చెప్పారు.
‘ఆ వలస కూలీల మాటలకు మా గ్రామస్తు లంతా ఆశ్చర్యపోయారు. క్వారంటైన్‌ ‌పూర్తి అయి పోయింది కాబట్టి అక్కడ నుంచి వెళ్లిపోవచ్చును. కానీ వాళ్ళు అలా చేయలేదు. పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు’ అని గుర్తుచేసుకున్నారు రామ్‌ ‌సింగ్‌ ‌షెకావత్‌.
‌తమకు ఇచ్చిన రంగులతో ఆ వలస కూలీలు పాఠశాలకు కొత్త అందాన్ని తెచ్చారు. ఆ విధంగా ఊరికే కూర్చోకుండా ఇతరులకు ఉపయోగపడే పని చేశారు. ఈ పాఠశాలలకు సున్నం వేసి తొమ్మిదేళ్లు అయిందని ఇప్పుడు వీళ్ళు పూనుకోవడంతో ఆ పని పూర్తయిందని పాఠశాలల ప్రధానోపాధ్యా యులు సంతోషం వ్యక్తం చేశారు. రంగులు, ఇతర సామగ్రి తెచ్చేందుకు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ జీతల్లో కొంత మొత్తాన్ని ఇచ్చారు. అయితే అంతకంటే విశేషం ఏమిటంటే పాఠశాలలకు రంగులు వేసినందుకు వలస కూలీలు ఒక్క నయాపైసా కూడా పుచ్చుకోలేదు. ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్‌, ‌వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్లూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్‌ ‌వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని  డబ్బును నిరాకరించారు.