వలస కార్మికులకు ఆహారం అందించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు


లాక్‌డౌన్‌ ‌మూలంగా వలస కార్మికులు పనులు లేక, అటు స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారంటూ విమర్శలు చేసిన వారు ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని తమ ఊళ్ళకు తరలించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడానికి మాత్రం ముందుకు రాలేదు. 

సమాజంలో ఎలాంటి అవసరం ఉన్నా మేమున్నామంటూ ముందుకు వచ్చే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు స్వగ్రామాలకు తరలివెళుతున్న వారికి తగిన సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా నీరు, ఆహారం అందజేశారు. ఈ పనిలో కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులంతా పాల్గొనడం విశేషం.
రైళ్లులో ప్రయాణించే వలస కార్మికులకు ఆహారాన్ని అందించాలని కోరిన 8 గంటలలోపే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలు వారికి సరపడే విధంగా దాదాపు 15 వేలకుపైగా చపాతీలు, 14 వేల పూరీలు చేసి అందించారు. ప్రధానంగా వీటిని కార్యకర్తల ఇంట్లో ఉండే మహిళలు చేసి ఇచ్చారు.
22 మే నాడు రాత్రి 11.30 గంటలకి పోన్‌ ‌ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సికింద్రాబాద్‌ ‌కు చెందిన కార్యకర్తలు కావలసిన వస్తువులను సేకరించారు. దాంతో పాటు ఇళ్లకు కూడా ఈ సూచన ఇవ్వడంతో మాతృమూర్తులు సైతం తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
బేగం బజార్‌లోని ఒక ఫంక్షన్‌ ‌హాల్‌లో కార్యకర్తలు చేరి భౌతిక దూరాన్ని పాటిస్తూ వంట, ప్యాకింగ్‌ ‌పనులు చేశారు. దీని వలన సికింద్రాబాద్‌ ‌నుండి నడిచే 10 రైళ్లు, లింగంపల్లి నుండి 8 రైళ్లు, కాచిగూడ, ఘటకేసర్‌ ‌నుండి  4, బొల్లారం నుండి 3 రైళ్లలో వెళ్తున్న వలస కార్మికులకు స్వయంసేవకులు ఆహారం, మంచినీటి ప్యాకెట్లు అందించారు. దారి పొడుగునా ఆహారానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపు 14000 పూరీలు, అందుకు తగినంత కూరలు తయారు చేసి ఇచ్చారు. అలాగే దిల్‌షుఖ్‌ ‌నగర్‌ ‌ప్రాంతం నుంచి కాచిగూడ రైల్వే స్టేషను నుండి వేళ్లే వలస కార్మకుల కోసం 2500 భోజన పొట్లాలు సిద్ధం చేశారు.