మహిళా నీకు వందనం


ఆకాశంలో సగం మగువ అనడం పాత మాట... ఆమె ఆకాశంలోనే సగం కాదు శ్రమలోనూ సగమే.. ఆమాటకొస్తే సగానికన్నా ఎక్కువ పాత్ర మహళలదే అని గర్వంగా చెప్పుకోవచ్చు.. నిజానికీ ఇపుడే కాదు ఎపుడూ మహిళల శ్రమశక్తి అనంతం. ఆదిమ కాలం నుంచి అత్యాధునిక కాలం వరకు సమాజ గమనంలో, పురోగమనంలో మహిళల శ్రమ చెప్పుకోదగినది.. ప్రపంచమంతటా విస్తరిస్తున్న కరోనా కష్టకాలంలో ఇంటా, బయటా మహిళల శ్రమ వర్ణించనలవిగాదు...

లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇప్పుడు అందరికీ ఇంటి నుంచే పని చేయడం మొదలైంది. దీంతో ఇంట్లో పిల్లలు, భర్త, అత్తా, మామలు ఇలా అందరికీ మహిళలే అన్నీ సమకూరుస్తున్నారు. ఇప్పటికీ ఇంటిపనుల్లో, వంటపనుల్లో మహిళలు ముందుపడుతు న్నారే తప్ప మగవారి భాగస్వామ్యం తక్కువ. వారు దానిగురించి ఎప్పుడూ ఆలోచించరు. ఎపుడయినా సరదాగా వంట చేస్తారేమోగానీ వంట పనులకు సంబంధించిన ఆలోచనలు మగవారికి ఉండవు. ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు కరోనా కారణంగా ఆమె పనిభారం మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రతిదీ శుభ్రం చేయాల్సిన అవసరం రావడం. ముందుకంటే ఎక్కువ శ్రమ తీసుకోవడం జరుగుతోంది.  అయితే ఇన్ని ఉన్నప్పటికీ ఈ కరోనా కష్టకాలంలో ముందుండి తాము తమ వంతు సహకారాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందిస్తున్నారు.
ఇంటి పనులు చేస్తూనే మరోవైపు సమాజ హితాన్ని కోరుకుంటున్నారు. ఎందరోమంది నిర్భాగ్యులకు తాము స్వతాహాగా వంట చేసి ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న మగవారికి సైతం ప్రేరణ కలిగించి వారుకూడా సహాయపడే వారిగా చేస్తున్నారు. గృహిణి ఇంట్లో మగవారికి సపోర్ట్ ‌చేయకపోతే వారు కూడా ఏమీ చేయలేరు అన్నది అక్షర సత్యం. బయటకి వెళ్లడానికే భయపడే ఈ రోజుల్లో చేయూతని అందివ్వమని ఏమీ కాకుండా కుటుంబాన్నిరక్షించే బాధ్యత తనదని తన భుజాలపై వేసుకుంటోంది సగటు ఇల్లాలు.
కరోనా మనుషుల్ని భీతవహుల్ని చేసిన నేపథ్యాన స్వచ్ఛత, శుభ్రతల గురించి నొక్కి చెబుతున్నారు.  అందుకని పారిశుద్ద్య కార్మికులు తమ జీవితాలనే పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ఇందులో మహిళలే అత్యధికంగా శ్రమ పడుతున్నారనేది వాస్తవం. ఇంటిలోపల  బయట ప్రదేశాలనే గాక, ప్రతిచోటా ఎలాంటి మురుగు లేకుండా, చెత్తాచెదారం లేకుండా, దోమలు రాకుండా అన్నివిధాల శుభ్రం చేసేపనుల్లో మహిళలు నిమగ్నమై ఉన్నారు. పొద్దున్నే లేచి రోడ్లమీదకు వస్తే దాదాపు పది, పన్నెండు గంటల వరకు పనులు చేస్తూనే కనిపిస్తారు.
ఇళ్ళల్లోని చెత్తను ఏరుకొచ్చేవారు కూడా మహళలే.. ఆ పని కూడా పనిమనుషులకు అప్పగిస్తారు. ఇలా ఇంటింటా పోగయ్యే చెత్తని ఒకచోట చేర్చి బండ్ల మీదకు తరలించే పనుల్లోనూ మహిళలే అనేకులు.
 కరోనా విజృంభణ నేపథ్యంలో రోగులకు దగ్గరగా మసలుకుంటూ (రక్షణ కవచాలు ఉన్నప్పటికీ) సేవలు చేయడం మహత్తర మైన విషయం. సాధారణమైన పరిస్థితుల్లోనూ రోగి ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ సేవలు చేస్తుంటారునర్సులు. ఇపుడు కరోనా నుంచి కోలుకునేందుకు చికిత్సని అందించడంలో చూపే చొరవని అభినందించాలి. ఈ సేవాక్రమంలో తమకు ఏం జరుగుతుందోననే భయం లేకుండా వారికి ధైర్యం చెబుతూ సేవలు అందించే నర్సుల్ని నాలుగు కాలాలు గుర్తుంచుకోవాలి.
ఇలా, డాక్టర్లుగా, పోలీసులుగా, నర్సులుగా, ఇంటి గృహిణిగా, పారిశుద్ధ్య కార్మికులుగా అటు సమాజ బాధ్యతలని, ఇటు ఇంటి బాధ్యతలను రెండింటినీ సమానంగా నిర్వర్తిస్తూ ఎంతో ఓపికగా... సమాజాన్ని ఇంటిని చైతన్య పరుస్తూ.. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకు కదులుతున్నారు రథసారధులుగా.. ఈ రీతిన లోకమంతా నడవటానికి ఆమె శ్రమ శక్తినే ఇంధనం. కానీ ఆమె శ్రమకు గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం అందరిపైనా ఉంది.
- లతాకమలం