కష్టకాలంలో స్వయంసేవకుల స్ఫూర్తి


అది పూణె మహానగరం, పైగా వేసవి కాలం. 40 డిగ్రీల మండే ఎండలో ఒక యువతి తన 10 మంది బృందంతో కలిసి భవానీపేట్‌లోకి ప్రవేశించింది. ఇంటింటికీ వెళుతూ కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఆమె పేరు సమృద్ధి జథర్‌. ‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌జనకళ్యాణ్‌ ‌సమితి ప్రతినిధిననీ, రోజూ ఇలా కంటైన్న్మెంట్‌ ‌జోన్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పింది. తానే కాదు తనలాగా మరో 675 మంది కార్యకర్తలు పని చేస్తున్నారని చెప్పింది.

 ఐతే ఇలా పని చెయ్యడమేమీ సులువు కాదు. మండే ఎండలో ఆ జు కిట్లు చాలా అసౌకర్యంగా ఉంటాయి కానీ ధరించక తప్పదు. నీరు, ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్నిసార్లు తీసుకోవడమూ కుదరక పోవచ్చు.
ఇటువంటి పరిస్థితుల్లో రోజూ 7 గంటల పాటు వీళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళే కాదు మరెంతమందో పని చేస్తున్నారు. అలాగని వీళ్ళందరూ మునిసిపల్‌ ‌సిబ్బందో, ఆరోగ్య శాఖ ఉద్యోగులో కాదు సామాన్య ప్రజలు. వీళ్ళందరికి ఈ విపత్కర పరిస్థితుల్లో పని చేయడానికి శిక్షణ ఇచ్చారు. దాని కోసం పూణె నగరంలో సూచించిన స్థానాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యుల పర్యవేక్షణలో కరోనా పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని సంఘ వైపు నుండి రవి వంజ్రవడ్కర్‌ ‌పర్యవేక్షిస్తున్నారు. అయితే వీళ్ళందరూ ఎలా, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనే ప్రశ్నకు వాళ్ళిచ్చిన సమాధానం ‘సేవ’. తామెవరికీ ఉపకారం చెయ్యట్లేదని, తమ వారికోసం పని చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ప్రమాదంతో కూడుకున్న పని అయినా నిర్భయంగా చేస్తున్నారు.

ఒకసారి ఒక కార్యకర్త 5 రోజులు మాత్రమే పని చేస్తాడు. ఆ తరువాత వెంటనే అతను ఇంటికి వెళిపోవడానికి వీలుండదు. జనకళ్యాణ సమితి వారి క్వారంటైన్‌లో నాలుగు రోజులు ఉండాలి. అయిదో రోజు వీరికి కరోన పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్‌ ‌తేలితే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చు. కాబట్టి ఇంటికి దూరంగా ప్రతికూల వాతావరణంలో నిత్యమూ పని చేస్తున్నారు. మరొక విశేషమేమిటంటే కుటుంబం మొత్తం వచ్చి పని చేస్తున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. సమృద్ధితో పాటు వాళ్లమ్మ రాజశ్రీ, నాన్న అభయ్‌ ‌థాకర్‌లు పని చేస్తున్నారు. సమృద్ధి వాళ్ళ 82 ఏళ్ల నాన్నమ్మ తనని తాను చూసుకోగలనని, తన కుటుంబం మొత్తాన్ని పంపడం విశేషం.

 ఈ పని చెయ్యడం అంత సులువేమీ కాదు. ప్రజల్లో ముఖ్యంగా మైనారిటీల్లో వ్యతిరేకత చాలా ఉంది. ఇప్పటికీ  వ్యతిరేక పోస్టర్లు కనబడు తున్నాయి. తాము పరీక్షలు చేయించుకోమంటూ నిరాకరిస్తున్నారు. ఇలాంటి ప్రతికూలతల మధ్య పని చెయ్యాలి. ఇలా చాలా మంది పని చేస్తున్నారు. రుతుజ మహేంద్ర అనే ఆయుర్వేద వైద్య విద్యార్థి, చేతన్‌ ఉమాప్‌ అనే స్టాన్‌ఫోర్డ్ ‌విద్యార్థి, ఇలా మరెంతో మంది వైద్యులు, కార్యకర్తలు పని చేస్తున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 27‌న మొదలయ్యాయి. ఇప్పటివరకు 100 కేంద్రాలలో 62 వేల మందిని పరీక్షించగా వెయ్యి మందికి తదుపరి వైద్యం సూచించారు. పూణె మేయర్‌ ‌మురళీధర్‌ ‌మొహోల్‌, ‌డెప్యూటి కమిషనర్‌ ‌రుబా అగర్వాల్‌ ‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రశంసించారు. ఈ మొత్తం కార్యక్రమంలో 250 మంది ప్రముఖ స్పెషలిస్టు వైద్యులు పాల్గొన్నారు. మొత్తంగా ఇప్పటివరకు 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌కార్యవాహ్‌ ‌భయ్యాజీ జోషి శ్రీరామనవమి సందేశంలో ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమం మొదలైంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే దేశం మొత్తంలో లక్షకు పైగా సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి.