‌శివాజీ నిర్భీతి.. (స్ఫూర్తి)


భయం ఒక అదృశ్యశక్తి. అది ఎలాంటివారినైనా కుంగదీస్తుంది. కానీ శివాజీ మహరాజులో ఈ భయం లేదు. రాజా జయసింగ్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు నిరాయుధుడై, కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటపెట్టుకుని వెళ్ళాడు. శత్రు శిబిరంలో ఆరురోజులపాటు ఉన్నాడు. అక్కడ తనకు ప్రాణాపాయం ఉందని బాగా తెలుసు. 
అయినా అటువంటి పరిస్థితిలో కూడా శివాజీ తన ధైర్యాన్ని కోల్పోలేదు. పైగా అక్కడే ఉన్న ఇటలీ రాయబారి నికోలై మంచుల్లీతో తుపాకీమందు, ఫిరంగుల తయారీవంటి విషయాలు అడిగి తెలుసుకున్నాడు. శివాజీ నిర్భీతి, కొత్త విషయాలపట్ల ఆసక్తి చూసి నికోలై ఆశ్చర్యపోయాడు. అదే విషయం తన డైరీలో వ్రాసుకున్నాడు.‘ప్రాణహాని ఉన్న పరిస్థితిలో ఒక వ్యక్తి కొత్తవిషయాలను తెలుసు కునేందుకు ఆసక్తి చూపుతున్నాడంటే అతనెంత నిర్భయుడో అర్థమవుతుంది. శివాజీని చూస్తే నాకు ఆశ్చర్యమేసింది’. నిజమే నికోలై తన జీవితంలో మొట్టమొదటసారి ఒక నిజమైన రాజును చూసి  ఉంటాడు.