‘ఆత్మనిర్భర భారతం’ పిలుపు గెలుపిక అవశ్యం


‘విజయశీలి కావాలి అందరం సంకల్పం చేయాలి అందరం
ప్రతి అడుగు అవకాశం, అందిపుచ్చుకొనుటె బలం
అలసత్వం వీడి మనం విశ్వాసం కల్గి మనం’
కరోనా కాటుకు ప్రపంచం విలవిలలాడింది. కాని కరచాలనం ఖర్మచాలనమైనదగ్గరనుంచి 123 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ‌మందుల్ని సరఫరా చేసేదాకా భారత్‌కు అవకాశాల పంట పండింది. నమస్కారంతో విశ్వభారతి ఆవిష్కరణ జరిగింది. ప్రకృతిని తల్లిగా భావించిన దేశం మనది. తల్లిని సేవించడం తప్ప శోషించడం మనకు తెలియదు. ప్రకృతి ఓ విజ్ఞానం.

ప్రకృతికి సహకరించనివన్నీ ప్రకృతి నుంచి మటుమాయమయ్యాయి. డైనోసార్లు ఇందుకు ఉదాహరణ. ఇందులో కొన్ని 2 మిలియన్‌ల నుంచి 20 మిలియను సంవత్సరాలు జీవించినవే. ఇక్కడే మనిషి ఉనికి ఎంత కాలం అనే ప్రశ్న వస్తుంది. కరోనా మానవ మరణ మృదంగం మ్రోగించింది. అగ్ర దేశాలే అతలాకుతలమయ్యాయి. సృష్టిలో హాసవిన్యాసాలు, హాహాకారాలు జరుగుతుంటాయి. పగలు వెలుగు, రాత్రి చీకటి మామూలే. మంచి జరిగితే పొంగిపోవడం, చెడు జరిగితే విస్మయం, భయంతో కుంగిపోవడం ఇది విజ్ఞసమాజ లక్షణం కాదు. మానవ సృష్టి జరిగింది. మానవేతిహాసాన్ని రచించిడం మానవుడి బాధ్యతే. అందుకు తగిన బుద్ధి, వివేకం అతనివద్ద ఉన్నాయి. కాని తన బుద్ధి, వివేకాలపట్ల విపరీతమైన అహంకారం, విశృంఖలతవల్లే నేడు ప్రకృతికి నష్టం జరుగుతున్నది. మానవుడి ప్రవృత్తి మాత్రమే ఇందుకు కారణం. చైనాలో జరిగిందిదే!
చైనాలో పర్యావరణం కలుషితమైపోయింది. అందుకే అక్కడ నుంచి మనదేశంలో ఫార్మారంగానికి సరఫరా అయ్యే ఉత్పత్తులు రావడం తగ్గిపోయింది. ప్రమాదకరమైన రసాయన ద్రావకాల స్థానంలో నీటిని వాడడం నేటి అవసరమైంది. ఆ దిశగా అన్ని దేశాలు పరిశోధనలు జరపాలి. భారత్‌లో నేడు ఈ పరిశోధనలు ఊపందుకోవడం ప్రముఖంగా జరగాలి. అదే మనల్ని ఆత్మనిర్భర భారతం వైపు అడుగు వేయిస్తుంది.
నాల్గవసారి లాక్‌డౌన్‌ ‌విధించడానికి ముందు మే 12న మన ప్రధాని మోదీ దూరదర్శన్‌లో మాట్లాడుతూ ‘‘2 నెలల క్రితం ఇక్కడ వ్యక్తిగత భద్రతా సామాగ్రి కూడా లేని మనం నేడు రోజుకు 20 లక్షల కిట్లు తయారు చేసుకొంటున్నామని, ఎన్‌-95 ‌మాస్కులు రోజుకు 20 లక్షలు తయారు చేసుకొంటున్నారని, కరోనా ఆపద ఓ అవసరాన్ని సృష్టించిందని, ఇదే మన దృష్టి కోణమని, ఇదే అత్మనిర్భర భారతం వైపు మనల్ని నడిపిస్తుందని’’ అన్నారు. ‘ధన’ కేంద్రీకృత వైశ్వీకరణ  ఇపుడు మానవ కేంద్రితమైంది. భారత్‌లో జరిగే మంచి పరిణామాలు ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. కరోనాతో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని కొందరు కుహనా మేధావులు గొంతు చించుకుంటున్నారు. భారతదేశ ప్రజల జీవనస్థితిగతులు  తెలిసిన వారెవరూ ఇలా మాట్లాడరు. ఉల్లిపాయతో పచ్చిరొట్టె కలిపి తిని ఆరోగ్యంగా బతుకుతున్న బహు సంఖ్య భారతీయ సమాజం మనవద్ద ఉంది. ఏమీ లేకపోయినా మామిడి కాయ పచ్చడి, పెరుగున్నంతో కడుపునింపుకునే సత్తా భారతీయులకుంది. పిజ్జాలు బర్గలు దొరకపోతే బెంబెలిత్తిపోయే సమాజం కాదిది. అలాగని మనం లేనివాళ్లం కాదు. కరోనా వంటి విపత్కర స్థితిలో కూడా మన రైతులు ఈసారి 34% అధికంగా ధాన్యం ఉత్పత్తి చేశారు. కరోనా నేపథ్యంలో చైనాలో ఇప్పటికే 2.3 లక్షల కంపెనీలు మూతబడ్డాయి. ఆ కంపెనీలలో ఉద్యోగులందరికీ జీతభత్యాలు లెక్కలు తేల్చి ఇంటికి పంపుతున్నారు. ఇప్పటికే మన దేశంలో 5.2 లక్షల కోట్ల విలువ చేసే  చైనా వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. కాని మన దేశం నుంచి కేవలం 1.2 లక్షల కోట్ల ఎగుమతులు మాత్రమే చైనాకు చేరుతున్నాయి. సుమారు 4.2 లక్షల కోట్ల ఈ వాణిజ్య లోటు చైనాను బలోపేతం చేస్తున్నది. అంతర్జాతీయ వ్యాపార నియమం ప్రకారం ఒక దేశం మరొక దేశ ఉత్పత్తులను బహిష్కరించమని చెప్పడం ప్రభుత్వం స్థాయిలో సాధ్యమయ్యేది కాదు. కాని 130 కోట్ల దేశ ప్రజలు నిర్ణయిస్తే ఇది సాధ్యమవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20 లక్షల కోట్ల ఆర్థిక సహాయంలో 3 లక్షల కోట్లు స్వదేశీ పరిశ్రమలకు ఊతమిచ్చేదే. ‘లోకల్‌’ ‌మన ‘ఓకల్‌’ ‌కావాలన్నారు మోదీ. స్థానిక ఉత్పత్తుల గురించి మాత్రమే మనం మాట్లాడాలని దాని అర్థం.  అప్పుడే ఆత్మ నిర్భర భారత్‌ ‌సాధ్యపడుతుంది.