జగన్నాథ రథయాత్ర


పూరీ జగన్నాథ దేవాలయం ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, దేవాలయము.  ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. . ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన ‘‘ఛార్‌ ‌థాం’’ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.

ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. జూన్‌ ‌లో (ఆషాఢ శుద్ధ విదియ) జరిగే బ్రహ్మాండమైన రథయాత్రలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలు ఉన్న మూడు పెద్ద రథాలను ఊరేగి స్తారు. మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండ బెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు.  ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
 గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే.