11 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించిన రక్షన పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ ఆసుపత్రిని అతితక్కువ కాలంలో నిర్మించి రికార్డ్ ‌సృష్టించింది రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్‌.‌డి.ఓ). ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైమానిక దళ స్థావరం వద్ద  250 ఐసియూ గదులతో కూడిన వెయ్యి పడకల ఆస్పత్రిని కేవలం 11 రోజుల్లో నిర్మించింది. టాటా సన్స్ ‌సంస్థ సహాయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో సాయుధ దళాలకు చెందిన వైద్య సిబ్బంది వైద్యసేవలు అందిస్తారు.
 సర్దార్‌ ‌పటేల్‌ ‌కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌ ‌లో 10 శాతం పడకలవద్ద ఆక్సిజన్‌ ‌సదుపాయం ఉంటుంది. అలాగే కరోన బాధితుల ఆందోళన, భయాన్ని తగ్గించేందుకు కౌన్సిలింగ్‌ ‌సదుపాయం కూడా ఉంటుంది. నిపుణులైన మానసిక వైద్యులు ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటారు. 
ఇక్కడ కోవిడ్‌ 19 ‌వ్యాధిగ్రస్తులకు ప్రాధమికమైన చికిత్స అందిస్తారు. ఆ తరువాత వారిని దీన్‌ ‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆసుపత్రికి, మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్య ఆసుపత్రులకు తరలిస్తారు. అవసరమైతే లోక్‌ ‌నాయక్‌ ‌జయప్రకాష్‌ ‌నారాయణ్‌ ఆసుపత్రి, రాజీవ్‌ ‌గాంధీ సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా పంపుతారు.
వెయ్యి పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని ఐటిబిపికి చెందిన 170మంది డాక్టర్లు, 700మంది నర్సులు నిర్వహిస్తారు. ఈ ఆసుపత్రిలో పడకలు, వివిధ చికిత్స సామగ్రిని వివిధ సామాజిక, స్వచ్ఛంద సంస్థలు విరాళంగా ఇవ్వడం విశేషం.
ఈ ఆసుపత్రిలో చికిత్సపొందే రోగుల మానసిక ఉల్లాసం కోసం గ్రంధాలయం, ఇండోర్‌ ‌గేమ్‌ ‌సెంటర్‌ ‌కూడా ఏర్పాటు చేశారు. రోగులకు రోజుకు ఐదు సార్లు ఆహారం ఇస్తారు. అందులో రోగనిరోధక శక్తిని పెంచే చవనప్రాశ, పళ్ల రసాలు, వేడి కషాయం మొదలైనవి కూడా ఉంటాయి.
ఢిల్లీ కంటోన్మెంట్‌లో  సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌కోవిడ్‌-19 ఆసుపత్రి పేరిట నిర్మించిన ఈ భవంతిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా, రక్షణ మంత్రి రాజనాథ్‌ ‌సింగ్‌ ఇటీవల సందర్శించారు. వీరితో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌, ‌ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌,  ‌డి.ఆర్‌.‌డి.ఓ చైర్మన్‌ ‌జి సతీష్‌ ‌రెడ్డి కూడా ఉన్నారు.
ఐసీయూ, వెంటిలేటర్‌ ‌వార్థులకు
కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు పేరు
ఇటీవల కాలంలో జరిగిన చైనా సరిహద్దు ప్రాంతంలోని గాల్వన్‌ ‌వ్యాలీ లోయలో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జవానుల పేర్లను ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో పెట్టాలని నిర్ణయించి నట్టు  డి.ఆర్‌.‌డి.ఓ సాంకేతిక సలహాదారు సంజీవ్‌ ‌జోషి అన్నారు. అందులో భాగంగా తెలంగాణ లోని సూర్యాపేటకు చెందిన కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు పేరుని ఐసీయూ మరియు వెంటిలేటర్‌ ‌వార్డుకి పెట్టారు.
ఇప్పటికే ఢిల్లీలో అత్యంత పెద్దదైన కరోనా సంరక్షణ కేంద్రం నిర్మించబడింది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు సమీపంలో ఉన్న చతర్పూర్‌ ‌ప్రాంతంలోని రాధాస్వామి సత్సంగ్‌ ‌బ్యాస్‌ ‌ప్రాంగణంలో నిర్మించిన ఈ కరోనా సంరక్షణ కేంద్రంలో ఒకేసారి 10 వేల మందికి పైగా చికిత్స చేయగల సామర్థ్యం ఉంది. ఇందులో వైద్యులతో సహా 2 వేలకు పైగా ఇండో టిబెటన్‌ ‌బోర్డర్‌ ‌పోలీస్‌, ‌సెంట్రల్‌ ఆర్మడ్ ‌పోలీస్‌ ‌ఫోర్స్ ‌సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.