ఆది గురువు వేదవ్యాసుడు

 

ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ జరుపుకొంటారు.
వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాస రూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే
వాసిష్టాయ నమోనమః
లోకానికి అంతటికి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురుపూర్ణిమగా జరుపుకోవటం సంప్రదాయం. సర్వజ్ఞానానికి మూలమైన వేదాలను వర్గీకరించి, వాటిని తన శిష్యుల ద్వారా ప్రపంచంలో వ్యాప్తిచేసిన వేదవ్యాసుడు ఆది గురువు. వేదాలకు వివరణ అయిన పురాణాలను అందించినది కూడా వ్యాసుడే.  పంచమవేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతాన్ని మనకు అందించినది కూడా ఆయనే. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని త్రుంచి మానవతా విలువలు, సద్గుణ సంపన్నత ఎలా పొందాలో నేర్పుతాడు. గురువు లోకంలో ఎలా జీవించాలో తెలియజేస్తాడు. ‘‘గు’’ కారో అంధకారస్య ‘‘రు’’ కారో తన్నిరోధకస్య; గు అంటే చీకటి రు అంటే పారద్రోలేవాడు. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు.
జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతజ్ఞతలు తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక, ముక్తి విద్యలను బోధించే గురుదర్శనానికి, స్మరణకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది.
ప్రాతఃకాలంలో సూర్యుడు తన సప్త అశ్వరథంపై అధిరోహించి సమస్త అంధకారాన్ని తొలగిస్తాడు. సూర్యుడు రథంపై ఉండే అరుణ పతాకమే భగవాద్వజం. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌లో భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించటం జరిగింది. గురుపూజ రోజు స్వయంసేవకులు భగవాధ్వజచ్చాయలో తను, మన, ధన పూర్వకంగా సమర్పణ చేస్తారు.