కమ్యూనిజం : హింస, అణచివేతల సిద్ధాంతం


ఆధునిక కమ్యూనిజంలో హింస విడదీయరాని అంశమని అనేక ఆధారాల ద్వారా తెలుస్తుంది. బందీలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం, నిరసనగళం వినిపించిన కార్మికులను చంపేయడం, రైతులను ఆకలిచావులకు గురిచేయడం వంటివి కేవలం ఎక్కడో జరిగిన ‘చెదురుమదురు’ సంఘటనలనే భ్రమ నుంచి మనం బయటపడాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ ‌వ్యవస్థ వేళ్లూనుకుందో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి.
కమ్యూనిజం అనేక ఘోరాలకు, అకృత్యాలకు పాల్పడింది. కేవలం వ్యక్తులపట్లనేకాదు ప్రపంచ నాగరకత, జాతీయ సంస్కృతులపట్ల అమానుషంగా వ్యవహరించింది. స్టాలిన్‌ అనేక చర్చ్‌లను నేలమట్టం చేయించాడు. ఫానోమ్‌ ‌చర్చ్ ‌ను ధ్వంసం చేయించిన పోల్‌ ‌పాట్‌ అం‌గర్కోర్‌ ‌వాట్‌ ‌దేవాలయాలను పాడుబడేట్లు చేశాడు. మావో సాంస్కృతిక విప్లవంలో రెడ్‌గార్డ్‌లు అనేక విలువైన సాంస్కృతిక కేంద్రాలు, చిహ్నాలను నాశనం చేశారు. ఈరకమైన విధ్వంసం ఒకఎత్తైతే తమ మాట వినని వారిని, స్త్రీలు, పిల్లలను కూడా, పెద్ద సంఖ్యలో హతమార్చడం మరొక ఎత్తు.
ఇలా సొంత పౌరులపైనే దారుణ మారణ కాండకు పాల్పడటం కమ్యూనిస్ట్ ‌వ్యవస్థలో సర్వసాధారణ విషయం. ప్రభుత్వాలను బట్టి పద్దతులు మారవచ్చునుగాని, ఫలితం, లక్ష్యం మాత్రం ఒకటే. ప్రత్యర్ధులను  అడ్డుతొలగించుకు నేందుకు ఉరిశిక్ష విధించడం, నీటిలో ముంచి చంపడం, కొట్టి చంపడం, విషవాయువులు వదిలి, విషం పెట్టి చంపడం, ‘కారు ప్రమాదాల’ ద్వారా చంపడం వంటి ఏ పద్ధతైనా అనుసరించవచ్చును. ఇక పెద్ద సంఖ్యలో ప్రజానీకాన్ని పరలోకానికి పంపడానికి కృత్రిమ కరవు సృష్టించడం, ఆకలి చావులు(ఆహారపదార్ధాల పంపిణీ ఆపేయడం), సుదూర ప్రాంతాలకు తరలించడం(అలా పంపుతున్నప్పుడు ఆకలి, శారీరక శ్రమ వల్ల మరణిస్తారు), గృహ నిర్బంధం, వెట్టి చాకిరీ వంటి పద్దతులు అవలంబిస్తారు.
ఇక ‘ప్రజా యుద్ధాల’ సంగతి మరింత క్లిష్టంగా ఉంటుంది. అవి పాలకులు, తిరుగుబాటుదారుల మధ్య జరిగినవా, లేక సాధారణ ప్రజానీకపు ఊచకోతలా అన్నది చెప్పడం చాలా కష్టం.
ఏది ఏమైనా కమ్యూనిస్ట్ ‌చరిత్ర పూర్తిగా రక్తంతో తడిసినదని చెప్పక తప్పదు. ఆ మారణకాండ ఎంత తీవ్రంగా ఉందో క్రింది సమాచారం చూస్తే అర్ధమవుతుంది. ఈ సమాచారం అనధికారికమైనదే అయినప్పటికీ కమ్యూనిస్ట్ ‌నేరాల తీవ్రతను తెలుపుతుంది.
సోవియట్‌ ‌రష్యా : 2 కోట్ల మరణాలు
చైనా : 6 కోట్ల 50 లక్షల మరణాలు
వియత్నాం: 10 లక్షల మరణాలు
ఉత్తర కొరియా: 20 లక్షల మరణాలు
కంబోడియా: 20 లక్షల మరణాలు
తూర్పు యూరోప్‌: 10 ‌లక్షల మరణాలు
లాటిన్‌ అమెరికా: 15లక్షల 50 వేల మరణాలు
ఆఫ్రికా: 10 లక్షల 70 వేల మరణాలు
ఆఫ్ఘనిస్తాన్‌: 10 ‌లక్షల 50వేల మరణాలు
అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ‌పార్టీలు: 10వేల మరణాలు
మొత్తం: 10 కోట్ల మరణాలు
ఈ సమాచారాన్ని పరిశీలిస్తే పోల్‌ ‌పాట్‌ ‌పాలనలోని కంబోడియాలో అత్యంత దారుణమైన మారణకాండ సాగిందని తెలుస్తుంది. కేవలం మూడున్నర సంవత్సరాల్లో అమానుషమైన హింస, భయంకరమైన కరవు మూలంగా దేశపు నాలుగువంతుల జనాభా మృత్యువాతపడ్డారు. అయితే మావో హయాంలో చైనాలో అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక స్టాలిన్‌, ‌లెనిన్‌ల పాలనలో సోవియట్‌ ‌రష్యాలో పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా, ‘రాజకీయ’ హత్యలు జరిగాయి.
ఇక్కడ నాజీ, కమ్యూనిస్ట్ ‌హింసల మధ్య పోలికను గమనించాలి. 1945లో సంకీర్ణ సేనల విజయం తరువాత నాజీల నేరాలు, అకృత్యాలు పూర్తిగా ప్రపంచానికి తెలిసిపోయాయి. ముఖ్యంగా యూదులపై సాగించిన మారణకాండకు నాజీలు సర్వత్రా తీవ్ర దూషణ, విమర్శలు ఎదుర్కొన్నారు. దశాబ్దాలుగా ఈ విషయమై అనేకమంది పరిశోధనలు చేసి అనేక విషయాలను వెలికి తీశారు కూడా. నైట్‌ ఆరిడ్‌ ‌ఫాగ్‌, ‌షోహ్‌, ‌సోఫియాస్‌ ‌ఛాయిస్‌, ‌షిండ్లర్స్ ‌లిస్ట్ ‌మొదలైన అనేక సినిమాలు ఇదే ఇతివృత్తంగా వచ్చాయి. వేలాది పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇక రాల్‌ ‌హిల్బెర్గ్ ‌వంటి రచయితలు థర్డ్ ‌రీచ్‌లో యూదులపై సాగిన అమానుష హింస, మారణకాండ గురించి ప్రత్యేకంగా అనేక పుస్తకాలు వ్రాసారు.
కానీ ఏ రచయిత, సినిమా నిర్మాత, దర్శకుడు కమ్యూనిస్టులు సాగించిన దమనకాండ, మారణ కాండలను పట్టించుకోలేదు. హిమ్లర్‌, ఈష్మన్‌ ‌వంటివారు 20 శతాబ్దపు అత్యంత క్రూరులైన వ్యక్తులని ప్రచారం బాగా సాగిందికానీ ఫెలిక్స్ ‌జెర్జిన్‌ ‌స్కీ, జెన్రిక్‌ ‌యగోడా, నికోలై ఎఝోవ్‌ ‌వంటివారి పేర్లు మాత్రం ఎక్కడ వినిపించవు. ఇక లెనిన్‌, ‌మావో, హొ చి మిన్‌, ‌స్టాలిన్‌లు చేసిన అకృత్యాలు ఎవరికి తెలియకపోగా వాళ్ళు మహా నాయకులుగా పేరుపొందారు. ఫ్రాన్స్ ‌ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ‌లాటరీ సంస్థ అయితే ఏకంగా తమ వ్యాపార ప్రకటనల్లో స్టాలిన్‌, ‌మావోల పేర్లను ప్రముఖంగా ఉపయోగించింది కూడా. మరి వీరిలాగానే హిట్లర్‌, ‌గోబెల్స్‌ల పేర్లను కూడా ఎవరైనా ఇలా వ్యాపారప్రకటనల్లో వాడే సాహసం చేయగలరా? అలాంటి అవకాశం ఉందా?
హిట్లర్‌ ‌చేసిన నేరాలను బయటపెట్టడం, వాటికి అతడిని బాధ్యుడిని చేయడంలో ఏ తప్పు లేదు. అలా చేయడం అతని వల్ల హింసకు గురైనవారి పట్ల సానుభూతి ప్రకటించడం అవుతుంది. అలాగే ఒకప్పుడు జరిగిన తప్పిదాలను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రజాస్వామ్య విలువలను పటిష్టపరచుకోవలసిన అవసరం తెలుస్తుంది. కానీ ఇదే ధోరణి కమ్యూనిస్ట్ ‌హింస గురించి కూడా అవలంబించాలి కదా అంటే మాత్రం ఎవరు పెద్దగా స్పందించరు. ఈ అసంబద్ధమైన మౌనం ఎందుకు? రాజకీయ నాయకులు, మేధావులు, రచయితలు 80ఏళ్లలో నాలుగు ఖండాల్లో మూడింట ఒకవంతు మానవ జనాభాను తుడిచిపెట్టిన కమ్యూనిస్ట్ ‌కరాళ నృత్యాన్ని గురించి ఏమాత్రం మాట్లాడరెందుకని? కమ్యూనిజం గురించి విశ్లేషిస్తున్నప్పుడు ఈ సామూహిక హత్యలు, వ్యవస్థీకృత నేరాలు, దారుణ మారణకాండ గురించి ప్రస్తావించరెందుకని? అది అంతగా అర్ధంకాని, అర్ధం చేసుకోలేని విషయమా? లేదా లోతుగా పరిశీలిస్తే కఠినమైన, కఠోరమైన నిజాలు ఎన్నో తెలుసుకోవలసివస్తుందనే భయమా?