స్వదేశీ అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు


- ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌సహ సర్‌ ‌కార్యవాహ శ్రీ భాగయ్య 

స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌మాననీయ సహ సర్‌ ‌కార్యవాహ శ్రీ వి.భాగయ్య అన్నారు.
30 జూన్‌ ‌న హైదరాబాద్‌లో స్వదేశీ స్వావలంబన్‌ అభియాన్‌ ‌సమన్వయకర్త శ్రీ సతీష్‌ ‌కుమార్‌ ‌వ్రాసిన పుస్తకాలు ‘స్వదేశీ స్వావలంబన్‌ ‌కి ఓర్‌ ‌భారత్‌’ (‌హిందీ), ‘ఇండియా మార్చింగ్‌ ‌టువర్డస్ ‌స్వదేశీ అండ్‌ ‌సెల్ఫ్ ‌రిలయన్స్’ (ఇం‌గ్లీష్‌) ఆన్‌లైన్లో విడుదల చేసిన సందర్భంగా ప్రసంగిస్తూ శ్రీ భాగయ్య తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి పథంలో, ఆర్థిక రంగంలో ముందుకు దూసుకు పోవడానికి, మానవుల అవసరాలను తీర్చడానికి ప్రకృతిని విచక్షణా రహితంగా దోపిడి చేసే సిద్ధాంతాలు సృష్టించబడ్డాయి. ఇందు మూలంగా ప్రపంచం అపనమ్మకం, అరాచకం, అసంతృప్తిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం, ఇటువంటి సంక్షోభ భరిత వ్యవస్థ నుండి పూర్తిగా బయటకు రావడానికి ప్రపంచం అడుగులు వేస్తోంది’’ అన్నారు.
ప్రకృతి విధ్వంసపూరిత అభివృద్ధి నమూనాను మార్చడానికే, స్వదేశీ స్వావలంబన ఉద్యమాన్ని దేశం మొత్తంలో స్వదేశీ జాగరణ మంచ్‌ ‌ప్రారంభించినట్లు శ్రీ భాగయ్య తెలిపారు. సంఘ భావజాల సంస్థలతో పాటు, గాయత్రీ పరివార్‌, ‌జగ్గీ వాసుదేవ్‌ ‌జీ మహారాజ్‌, ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌ ‌తదితర సంస్థలు ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయని అన్నారు.
ఏప్రిల్‌ 26 ‌న రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌పూజ్య సర్‌ ‌సంఘచాలక్‌ ‌కూడా స్వదేశీ పిలుపు నిచ్చారని అన్నారు. గడిచిన 250 సంవత్సరాలు మినహా, భారతదేశం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ఆధారిత దేశంగా గొప్పగా విలసిల్లింది. తెలంగాణ గ్రామాల నుండి ఇంగ్లాండ్‌కు ఉక్కు, బెంగాల్‌, ‌తమిళనాడు గ్రామాల నుండి బట్టలు ఎగుమతి అయ్యేవని తెలియజేసారు. ఇటీవల, విజయవాడలోని ఒక సంస్థ 5 కోట్ల విలువైన గ• ఆధారిత ఉత్పత్తులను విజయవంతంగా ఎగుమతి చేసిందని శ్రీ భాగయ్య వెల్లడించారు.
స్వదేశీ ప్రచారపు ముఖ్య లక్షం గ్రామాలను కేంద్రంగా చేసుకొని వ్యవసాయాన్ని ఆధారంగా  అభివృధి పథంలో ముందుకు సాగడమే. అంతేకాక, స్వయంప్రతిపత్తి, స్వదేశీపట్ల ప్రభుత్వ ఆలోచనలలో మార్పుతేవడం, ప్రభుత్వ విధానాలలో అవి ప్రతిబింబించే విధంగా చేయడమే స్వదేశీ ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
స్వదేశీ స్వావలంబన్‌ అభియాన్‌ను 2020,మే 20 న స్వదేశీ జాగరణ మంచ్‌ ‌ప్రారంభించింది. ఈ కార్యక్రమపు మొదటి దశలో, చైనా వస్తువులను బహిష్కరించాలంటూ డిజిటల్‌ ‌సంతకాల సేకరణ జరుగుతుంది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా  డిజిటల్‌ ‌సంతకం చేసి స్వదేశీ వస్తువులను మాత్రమే వాడుతామని ప్రతిజ్ఞ చేసారు. ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
వినియోగదారులలో స్వదేశీ, స్వావలంబన మేల్కొలిపి, నిబద్ధతను పెంచడమే ‘స్వదేశీ స్వావలంబన్‌ అభియాన్‌’ ‌ముఖ్య లక్ష్యం. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల వారు, ఆహార తయారీ పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, ఇతర వ్యవసాయేతర కార్యకలాపాలతో స్వదేశీ పరిశ్రమలలో చైతన్యం నింపడం ద్వారా స్వదేశీ స్వావలంబన సాధించడానికి వీలవుతుంది. మనం దేశంలోని దాదాపు 700 జిల్లాలకు స్వదేశీ ఉద్యమం ద్వారా చేరుకోవచ్చు. ఈ కాలంలో, టీవీ ఛానెల్స్, ‌సివిల్‌ ‌సొసైటీ సంస్థలు నిర్వహించిన సర్వేలలో, దేశంలోని దాదాపు ప్రతి ఒక్కరూ స్వదేశీని పాటిస్తామని, చైనాకు సంబంధించిన వస్తువులన్నింటినీ బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేయడం మనం చూశాం. ప్రభుత్వం ఇప్పటికే చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించింది. చైనా నుండి దిగుమతులపై అనేక ఆంక్షలు విధించిన తరువాత, చైనా కంపెనీల టెండర్లు పెద్ద సంఖ్యలో రద్దవు తున్నాయి. కొద్ది రోజుల క్రితమే భారతప్రభత్వం 59 చైనా యాప్‌లపై నిషేధం విధించడం అందరికీ తెలిసిన విషయమే.
స్వదేశీ అభియాన్‌ ‌ప్రారంభించిన ఈ ఒకటిన్నర నెలలో, చిన్న పరిశ్రమలలో చైతన్యం నింపే ఉద్దేశ్యంతో కార్మికులను, రైతులను, చిన్న తరహా పారిశ్రామికవేత్తలను, విద్యావేత్తలను, సాంకేతిక నిపుణులను, పరిశ్రమ, వాణిజ్య నాయకులతో సహా అన్ని వర్గాల ప్రజలను ఈ అభియాన్‌లో చేర్చే పక్రియ ప్రారంభమైంది. వివిధ సంస్థల, సంఘాల సహకారంతో, ప్రజలలోకి వెళ్ళి స్వదేశీ / స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే కాకుండా వాటికి సంబంధించిన ప్రయోజనాల గురించి ప్రజలకు సవివరంగా చెప్పడం జరుగుతుంది. దీనికోసం, పరిశ్రమలకు చెందిన వ్యక్తులు, వ్యాపార వాణిజ్య వ్యక్తులతో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రపంచీకరణ యుగంలో నిర్లక్ష్యానికి గురైన స్థానిక పరిశ్రమలను పునరుద్ధరించడానికి, సంక్షేమం, స్థిరమైన ఆదాయాలు, ఉద్యోగ కల్పనకు సహాయపడేవిధంగా మొత్తం మీద ప్రజలలో విశ్వాసం కలిగించే ఆర్థిక విధానాలను రూపొందించడానికి స్వదేశీ ఉద్యమం అత్యంత అనుకూలమైన సమయం.
దేశంలో 700 కి పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల క్లస్టర్‌లు ఉన్నాయి. ఈ సమూహాలకు   సుదీర్ఘ, సంపన్న పారిశ్రామిక అభివృద్ధి చరిత్ర ఉంది. చైనా నుండి అవినీతికర పోటీ, దిగుమతుల కారణంగా ఈ పారిశ్రామిక సమూహాలలో చాలా మంది తమ ఉనికిని కోల్పోయారు. ఇటువంటి వారికి అన్ని విధాలుగా మద్ధతునివ్వడం తిరిగి వారి ఉనికిని చాటుకోవడానికి అన్ని రకాలుగా సహాయం అందించడం అవసరం.అప్పుడు వారు ఉపాధి అవకాశాలను సృష్టించటమే కాకుండా అధిక నాణ్యత కలిగిన వస్తువులను ఉత్పత్తి చేస్తారు.
భారత్‌ ‌స్వయంప్రతిపత్తిలో గ్రామీణ హస్తకళలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహార తయారీ పరిశ్రమలు, కోళ్ళు, పాడి, చేపలు, పుట్టగొడుగుల పెంపకం, వెదురు పెంపకం, ఫ్లోరి కల్చర్‌, ‌హార్టికల్చర్‌, ఇతరత్ర పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. సమగ్ర గ్రామీణాభి వృద్ధి దిశగా అడుగులు వేయడం, సమగ్ర గ్రామీణ ఆర్థిక అభివృద్ధి గురించి అవగాహన కల్పించడమే స్వదేశీ స్వావలంబన ఉద్యమపు తక్షణ కర్తవ్యం అని శ్రీభాగయ్య వివరించారు.
ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్‌ అఖిలభారత సంఘటక్‌ శ్రీ ‌కాశ్మిరిలాల్‌, ‌పుస్తక రచయిత శ్రీ. సతీష్‌ ‌కుమార్‌ ‌పాల్గొనగా, గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయం వైస్‌ ‌చాన్సెలర్‌ ‌ప్రొఫెసర్‌ ‌భగవతి ప్రకాష్‌ ‌శర్మ పుస్తక పరిచయం చేశారు. స్వదేశీ జాగరణ మంచ్‌ అఖిలభారత కన్వేనర్‌ శ్రీ ‌సుందరం వందన సమర్పణ చేసారు.