రామజన్మభూమి ఆలయం కోసం 28 ఏళ్ళు ఉపవాసం

రామజన్మభూమిలో ఆలయం కోసం ఓ మహిళ 28ఏండ్ల పాటు ఉపవాసం చేసింది. జబల్‌పూర్‌కు చెందిన 81ఏళ్ల ఊర్మిలా చతుర్వేది రామమందిరం నిర్మాణం ప్రారంభమయ్యే వరకూ ఉపవాసం ఉంటానని 28ఏండ్ల క్రితం శపథం చేసింది. ఆగస్టు 5 రామమందిర భూమిపూజ జరుగడంతో 28 ఏండ్ల ఆమె కల నెరవేరింది. ఈ 28 ఏండ్లు ఆమె పండ్లు, ఫలాలను మాత్రమే తింటూ జీవనం సాగించింది..

మధ్యప్రదేశ్‌ ‌జబల్‌పూర్‌లోని విజరునగర్‌కి చెందిన ఊర్మిళ 1992లో బాబ్రీ మసీదు కట్టడం కూల్చివేత, దేశంలో చెలరేగిన అల్లర్ల సమయంలో, అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభమయ్యే వరకూ పండ్లు మాత్రమే తింటానని దీక్ష పూనారు. గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు అయోధ్యలో రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి అనుమతిచ్చింది. ఇందుకుగాను ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఆమె తనయుడు అమిత్‌ ‌చతుర్వేది కోర్టు తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తన తల్లి 54 సంవత్సరాలున్నప్పుడు ఉపవాసాన్ని ప్రారంభించిందని, ఆమె 27ఏండ్లుగా పండ్లు, పాల మీదనే జీవితం కొనసాగించిందని తెలిపారు. కోర్టు తీర్పుతో ఆమె చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

కోర్టు తీర్పుతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయానికి 28ఏండ్లు సమయం పట్టినా, అయోధ్య రామజన్మభూమిలో ఆలయం నిర్మించడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ 28ఏండ్లలో ఎంతో మంది బంధువులు తనని ఆహారం తీసుకొమ్మని బలవంతం చేసినా ఆమె మాత్రం ఎంతో భక్తి, శ్రద్ధలతో తన ఉపవాసాన్ని కొనసాగించింది. ఇందుకు కుటుంబ సభ్యుల మద్ధతు కూడా తోడైంది. ఆమెను అయోధ్యకు తీసుకెళ్ళి, వీలైనంత త్వరగా సరియూ నది ఒడ్డున ఉపవాస దీక్ష విరమింపచేయాలని ఆమె కుటుంబం యోచిస్తోంది. ఉర్మిళా చతుర్వేది తన కుటుంబంతో కలిసి ఆలయ భూమిపూజలో పాల్గొనాలని కోరుకున్నప్పటికీ, కోవిడ్‌ -19 ‌మహమ్మారి వల్ల వెళ్ళలేక పోయారు.